Sand Danda in YSR district latest news: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలో గతకొన్ని నెలలుగా అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులను, వంకలను, నదులను వదలకుండా వారి దందా కోసం ఇసుకను కొల్లగొడుతున్నారు. అంతేకాదు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే పెన్నా నది గర్భాన్ని సైతం పెకలించి, ఇష్టారీతిగా ఇసుకను తరలిస్తున్నారు.
తమ దందాను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే.. తొక్కించుకుంటూ వెళ్తామంటూ వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించారని వందలామంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఈ దందాపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు గ్రామస్థులు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గానీ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా చెన్నూరు సమీపాన పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడు నెలలుగా ఇష్టానుసారంగా నదులను తవ్వేస్తూ, విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారు. ఖాజీపేట మండల పరిధిలో 4 హెక్టార్లలో ఏడాదికి 45 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మాత్రమే అధికారులు అనుమతిచ్చారు. అది కూడా మీటర్ లోతు మాత్రమే తవ్వాలని నిబంధన విధించారు. కానీ, అధికార పార్టీ నేతలు గుత్తేదారుల అవతారం ఎత్తి, రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నది మధ్యలో దాదాపు 5 మీటర్ల లోతు వరకు తవ్వేసినా పట్టించుకునే వారే లేరని సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు.
ఖాజీపేట, చెన్నూరు, కడప మండలాల పరిధిలో దాదాపు వంద గ్రామాలకు పెన్నా నది నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక టిప్పర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వాహనాలతో తొక్కించుకుంటూ వెళ్తామని వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించారని వాపోతున్నారు. ఈ దందాపై పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు.
పెన్నా నదిలో ఇసుక దందా గురించి తెలిసి.. తెలుగుదేశం నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఏడాదికి 45వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలను అనుమతించగా, 6 నెలల కాలంలోనే 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తరలించేశారని.. పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. దీనిపై నదీ ప్రాంతం నుంచే ఏడీకి ఫోన్‌లో ఫిర్యాదు చేయగా.. డీడీకి చెప్పమన్నారని సుధాకర్ తెలిపారు. తక్షణం ఇసుక తవ్వకాలు నిలిపివేయకుంటే.. హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఇవీ చదవండి