అర్హుడైన తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని, అలాగే తమ గ్రామంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన పట్టాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదంలో కలకలం సృష్టించింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నూటికుర్తి శ్రీనుబాబు (41) గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇతడు తండ్రితో పాటు రెండు వాటాల ఇంట్లో ఉంటుండటంతో ఆయన పేరును అర్హుల జాబితా నుంచి తొలగించి, సోదరుడికి స్థలం కేటాయించారు.
తనకు జరిగిన అన్యాయంతో పాటు, ఇప్పటికే పూర్తయిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగ్రహించిన కొందరు స్థానికులు ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ కొన్నాళ్లుగా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి రోజు ఇంట్లో మద్యం తాగుతున్న శ్రీనుబాబును తండ్రి నరసింహమూర్తి మందలించారు. దీంతో అందరూ తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ పురుగుల మందు తాగారు. చికిత్స నిమిత్తం అతడిని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మృతుడి సోదరుడు మల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోడూరు ఎస్సై బి.సురేంద్రకుమార్ తెలిపారు. మృతుడి భార్య జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు.
ఇదీ చదవండి: