Road Accidents Several Dead: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు.. మార్జిన్లో నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌పై బోల్తాపడింది. ఈ ఘటనలో తాడేపల్లిగూడెంకు చెందిన ఆదిత్య(25) అనే కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స మేరకు సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
NIT Students Road Accident: ఆరుగురు ఏపీ ఎన్ఐటీ విద్యార్థులు.. తమ స్నేహితుడి పుట్టినరోజు జరుపుకునేందుకు.. కారులో ఏలూరు మార్గం వైపు అతివేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరిన పోలీసులు పరిశీలనలు చేపట్టారు. కారులో మద్యం సీసా, బర్త్‌డే కేక్, పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన బాణసంచాను పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు.. గుంటూరుకు చెందిన గాజులపాటి హర్షవర్ధన్ (బీటెక్ ఫస్ట్ ఇయర్), అనంతపురంకు చెందిన పెనకుమాటి విష్ణువర్ధన్ (బీటెక్ థర్డ్ ఇయర్), నిడదవోలుకు చెందిన జగతా శ్రీనివాస్ (సెకండ్ ఇయర్), విజయవాడకు చెందిన ఎన్ సాత్విక్ (బీటెక్ సెకండ్ ఇయర్), గుంటూరుకు చెందిన ఈశ్వర్ (బీటెక్ సెకండియర్), నెల్లూరుకు చెందిన నవీన్ (సెకండ్ ఇయర్). ఈ ఆరుగురు విద్యార్థులు జాతీయ విశ్వవిద్యాలయం ఎన్ఐటిలో చదువుతున్నారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న విశ్వవిద్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెంలోని యూనియన్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నవీన్, ఈశ్వర్ అనే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమాచారం ఈ ప్రమాదంపై తెలుసుకొని నేరుగా విజయవాడ నుంచి ఆసుపత్రికి వెళ్లి.. విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.
Road Accident at Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్నాటక ప్రాంతం నుంచి మంత్రాలయంకు వీరభద్ర గౌడ్(40) అనే నిర్వాహకుడు 340 మంది భక్తులను పాదయాత్రగా ప్రతి సంవత్సరం తీసుకువస్తున్నారు. ఈ ఏడాది సైతం భక్తులతో పాదయాత్రగా వస్తుండగా మంత్రాలయం శివారులో హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరభద్ర గౌడ్ మృతి చెందారు. దీంతో ఆయనతో పాటు వచ్చిన భక్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
Road Accidents in AP: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు.. తొమ్మిది మంది మృతి