Power supply stop : విద్యుత్తు బిల్లులు చెల్లించని పుర, నగరపాలక సంస్థలకు విద్యుత్తు పంపిణీ సంస్థలు షాకిస్తున్నాయి. ఇప్పటికే ఒక నగరపాలక సంస్థ, మరో పురపాలక సంఘం కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. మిగతావాటిపైనా ఇలాంటి చర్యలే తీసుకోవాలని భావిస్తున్నారు. బకాయిల జాబితాలను సిద్ధం చేసిన విద్యుత్తు పంపిణీ సంస్థల అధికారులు దశలవారీగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని స్థానికసంస్థలు విద్యుత్తు పంపిణీ సంస్థలకు దాదాపు రూ.10 వేల కోట్లు బకాయి పడ్డాయి. చెల్లించాలని తాఖీదులిచ్చినా, కమిషనర్లను నేరుగా కలిసి కోరినా స్పందన లేకపోవడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి శుక్రవారం ఉదయం సరఫరా నిలిపివేసిన విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు తిరిగి సాయంత్రం పునరుద్ధరించారు. నగరపాలక సంస్థ దాదాపు రూ.8 కోట్లు బకాయి పడింది. ఒకటి, రెండు రోజుల్లో రూ.60 లక్షలు చెల్లించేందుకు అంగీకరించడంతో సరఫరాను పునరుద్ధరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పురపాలక సంఘం కార్యాలయానికి శుక్రవారం విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. రూ.80లక్షల వరకు బకాయి ఉంది. కార్యాలయానికి సమీపంలోని జల యాజమాన్య సంస్థ కార్యాలయం నుంచి విద్యుత్తు తీసుకునే అవకాశం ఉందని భావించి.. ఆ కార్యాలయానికీ సరఫరాను నిలిపివేయడం విశేషం.
నిధులున్నా.. ఏం లాభం?
కొన్ని పుర, నగరపాలక సంస్థలు ఆర్థికంగా బలంగా ఉన్నా సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)లో బిల్లులు వెంటనే అనుమతించని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పన్నులు, ఇతర రుసుముల కింద వసూలవుతున్న నిధులన్నీ సీఎఫ్‌ఎంఎస్ నియంత్రణలోకి వెళ్లాయి. పట్టణ స్థానికసంస్థలు అప్‌లోడ్ చేసిన బిల్లులన్నింటినీ సీఎఫ్‌ఎంఎస్‌లో అనుమతించడం లేదు. అత్యవసరమని భావించే వాటికే విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్తు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు పుర కమిషనర్లు చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి : PRC: 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ప్రాసెస్ చేస్తున్న ట్రెజరీ ఉద్యోగులు