పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల క్రితం అపార్టుమెంట్ మీద నుంచి పడి మృతి చెందిన వృద్ధుడు కేసు మరో మలుపు తిరిగింది. మెుదట అందరూ ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయి ఉండవచ్చునని అనుకున్నారు. కానీ... అతని ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ద్వారా అతడు వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడనే విషయం బయటపడింది.
అసలేం జరిగింది
కోరుకొండ లక్ష్మీపతిరావు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన.. సొంత స్థలంలో జయలక్ష్మీ రెసిడెన్సీను నిర్మించారు. అందులో ఒక ఫ్లాట్ మినహా అన్నింటినీ అమ్మేశారు. ఒక ఫ్లాట్‌ను అద్దెకిస్తున్నారు. వయోభారంతో అపార్టుమెంటు నిర్వహణ బాధ్యతలు కమిటీకి అప్పగించేశారు.
కమిటీ సభ్యులైన వంక లక్ష్మికుమారి, శేషులు తనని వేధింపులకు గురి చేయటంతో పాటు.. తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని సూసైడ్ లేఖలో రాశారు. అపార్టుమెంటు కాపలాదారుడితో కుమ్మక్కై తీవ్రంగా వేధించారని లక్ష్మీపతిరావు లేఖలో పేర్కొన్నారు. తన ఫ్లాట్‌లోకి ఎవ్వరినీ అద్దెకు రానివ్వటం లేదనీ... వచ్చిన వారిని ఉండనివ్వటం లేదని లేఖలో రాశారు. వారి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో వివరించారు.
84 ఏళ్ల వృద్ధుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం అందరి కంట కన్నీరు పెట్టిస్తుంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడు భార్య జయలక్ష్మి వేడుకుంటుంది.
ఇదీ చదవండి: కరోనా పాజిటీవ్ అనుకుని.. ఆందోళనతో వృద్ధుడు మృతి..