ముఖ్యమంత్రి జగన్ ఈనెల 19న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అందుకు సంబంధించి ముందస్తు భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్, జలవనరుల శాఖ అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గోనే అధికారులు, ప్రజాప్రతినిధులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 2 వేల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను సిద్ధం చేశారు.
పర్యటన వివరాలు..
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్ హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు పోలవరం చేరుకోనున్నారు. ప్రాజెక్టులోని స్పిల్ వేలోని స్లూయిస్ గేట్లు, కాఫర్ డ్యామ్, పైలట్, స్పిల్ ఛానల్, అప్రోఛ్ చానల్ వద్ద క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలన చేయనున్నారు. కాఫర్ డ్యామ్ వద్ద నదీ ప్రవాహ పరిస్థితి, బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాలపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రాజెక్టులోని సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులతో జగన్ సమావేశమవుతారు. ముంపు ప్రాంతాల పరిస్థితి, పునరావాసం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి
Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం