పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి లేఖ రాసిన ఆయన.. కృష్ణా-గోదావరి బేసిన్ పరిధిలోని తన నియోజకవర్గంలోని భీమవరం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రాజధానిగా ఉందన్నారు. ఇక్కడి నుంచి సుమారు 80వేల కోట్ల సముద్ర ఉత్పత్తులు ప్రస్తుతం ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
ఇక్కడున్న ఆక్వా పరిశ్రమకు మరిన్ని వనరులు, నైపుణ్యాలు అందిస్తే 4, 5 లక్షల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇందుకు వ్యవస్థాగత మద్దతు కావాల్సి ఉన్నందున ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు. 910 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతం నుంచి భారీగా చేపలు పట్టడానికి వీలుందని... అయితే మత్స్యకారులు 20-25 నాటికల్ మైళ్లకు మించి పోవడానికి వీలులేక పోవడంతో బంగాళాఖాతం లోతుల్లోనుంచి చేపలు పట్టడానికి అవకాశం లేకుండా పోయిందని లేఖలో తెలిపారు.
వారికి తగిన నైపుణ్యం కల్పిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. గతంలో కొరియా ప్రధానమంత్రి, మంత్రులతో మాట్లాడినప్పుడు భారత్‌లో వెయ్యి కోట్ల రూపాలయలతో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించినట్లు తెలిసిందన్న రఘురామరాజు... మీ నాయకత్వంలో ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటైతే మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆక్వాహబ్‌గా పేరొందిన నర్సాపురం నియోజకవర్గంలో ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అన్నారు.
గోదావరి ప్రాంతం నుంచి చేపలు, రొయ్యల ఎగుమతులు పెరిగి దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టడమే కాకుండా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఈ రంగంలో నెంబర్‌వన్‌గా నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 600-1,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని.. తన నియోజకవర్గంలోని గొల్లపాలెంలో ఇందకు అనువైన భూమి అందుబాటులో ఉందని వెల్లడించారు. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: