వైకాపా నుంచి సస్పెండ్ అయిన తర్వాత నరసాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.., ఏ తప్పు చేయకుండా పార్టీ వేటు వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సాయంత్రంలోపు సస్పెన్షన్ కారణాలు మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టపరంగా పోరాటం చేస్తానని హెచ్చరించారు.
Kothapalli Subbarayudu: వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైకాపా నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు నిన్న (బుధవారం) ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయని.. దాంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు సుబ్బారాయుడును సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో సుబ్బారాయుడు పాల్గొన్నారు. దీనికి తోడు స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్‌రాజుపై బహిరంగ విమర్శలు చేయడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానని విలేకరుల సమావేశంలో బహిరంగంగా ప్రకటించడం అధిష్ఠానం ఆగ్రహానికి కారణమైంది.
స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలే కారణమా?: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. నరసాపురంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ గుర్తు ఉన్నా, లేకపోయినా విజయం సాధిస్తానన్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి 2019లో తప్ప.. అన్ని సార్లు పోటీలో ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలు, పార్టీల్లో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు కూడా సొంత బలం ఆధారంగానే గెలిచానన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటారనే సందేహం ప్రజల్లో నెలకొందని, దీనిపై స్పష్టత ఇచ్చేందుకు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేసిన తనపై ఏ1గా కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. కేసులు గురించి పట్టించుకోనని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని వెల్లడించారు.
నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్యభూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ.. జిల్లా సాధనకోసం ఇటీవల జరిగిన ఉద్యమంలో తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సుబ్బారాయుడు తీరుపై అప్పటి నుంచి వైకాపా అగ్రనాయకత్వం గుర్రుగా ఉంది. ఈ ఘటనపై వైకాపా సీనియర్ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని విమర్శించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సబ్బారాయుడు ప్రకటనతో వైకాపా అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవీ చూడండి