పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 5వ రోజు ప్రధాన ఘట్టమైన స్వామి తిరుకల్యాణ మహోత్సవం కనులపండుగగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిలను పరిణయమాడిన ఆధ్యాత్మిక ఘట్టం భక్తులకు నేత్రపర్వమైంది.
మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కల్యాణం రమణీయంగా సాగింది. తొలుత శ్రీ వారి కల్యాణ మండపాన్ని పూలతో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లను తొలక్కం వాహనంపై అలంకరించి ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. మండపంలో స్వామి- అమ్మవార్లను కల్యాణమూర్తులుగా కొలువుదీర్చి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు వరపూజ జరిపించారు.
దేవస్థానం ఛైర్మన్ కుమారుడు నివృతరావు, స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఆలయ ఈవో భ్రమరాంబ చేతులమీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు అలంకరించి వేద మంత్రాల నడుమ కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదన చేసి నీరాజన మంత్ర పుష్పం సమర్పించారు. కల్యాణం అనంతరం వెండి గరుడ వాహనంపై శ్రీవారి కోవెల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఇదీ చూడండి: వాల్మీకి జయంతోత్సవాల్లో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ