ప్రైవేట్, ప్రభుత్వ పరిశ్రమల మధ్య ఆయిల్ పామ్ గెలల తరలింపు పోటీపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ప్రైవేట్ వారికి ఇస్తే ఎక్కువ ధర వస్తుందని భావిస్తున్నారు. ఈ పోటీ వల్ల భవిష్యత్తులో ఆయిల్ పామ్ పరిశ్రమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెదవేగిలోని ప్రభుత్వ ఆయిల్ పరిశ్రమకు రావలసిన గెలలు సక్రమంగా రావడం లేదని చెబుతున్నారు.
ఏటా 40 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ పామ్ గెలలు ఇతర పరిశ్రమలకు తరలిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పోటీ వల్ల భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం టన్ను గెలలకు రూ. 9,040 ఇస్తుండగా ప్రైవేట్ పరిశ్రమల వారు 11 వేల వరకు ఇస్తున్నారు. ఇందులో రైతులకు దక్కేది పది వేలే. మిగిలిన మొత్తంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారు రవాణా, కూలీల ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పొందుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగా వస్తుండడంతో రైతులు ప్రైవేట్ పరిశ్రమలకు గెలలు అమ్ముకోవడానికి ముందుకు వచ్చారు . గతంలో చాటుమాటుగా జరిగే వ్యవహారం ఇప్పుడు బహిరంగంగా జరుగుతోంది. ఫలితంగా పరిశ్రమల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమల ఏర్పాటు సమయంలో విస్తీర్ణానికి మించిన సామర్థ్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడమే ప్రస్తుత పోటీకి కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెదవేగిలోని ప్రభుత్వ ఆయిల్ పరిశ్రమకు కేటాయించిన ఏరియా వారిగా గంటకు 24 టన్నుల మిల్లింగ్ చేసే విధంగా పరిశ్రమను ఏర్పాటు చేశారు. అయితే ప్రైవేట్ పరిశ్రమల వారు మాత్రం 100 నుంచి 120 టన్నులు మిల్లింగ్ చేసే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు సమాచారం . ఆయిల్ ఫామ్ గెలలను మిల్లింగ్ చేసే సమయంలో పూర్తి సామర్థ్యంతో మిల్లింగ్ చేసిన, తక్కువ గెలలతో మిల్లింగ్ చేసిన అయ్యే ఖర్చు ఒకటే. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మే నెలాఖరు వరకు ఆయిల్ పామ్ గెలల నుంచి వచ్చే ఓఈఆర్ ఎక్కువగా ఉంటుంది . దీనితో పరిశ్రమల వారు బయట పరిశ్రమల జోన్ నుంచి ఆయిల్ ఫామ్ గెలలు కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టారు.
గతంలో కూడా ఇదేవిధంగా కొనుగోలు చేసిన చాటుమాటుగా వ్యవహారం నిర్వహించేవారు. ప్రస్తుతం బహిరంగంగానే కొనుగోలు సాగుతుండడంతో కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యాన శాఖ ఉప సంచాలకులు టివీ సుబ్బారావు మాట్లాడుతూ.. ఇతర అధికారులతో కలిసి ఆయిల్ ఫామ్ గెలలు జోనల్ విధానానికి విరుద్ధంగా ఇతర పరిశ్రమలకు తరలించడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. అయితే రైతులు మాత్రం తమకు ఎక్కువ ధర వస్తుందని అమ్ముకుంటున్నామని చెబుతున్నారు . దీనిపై ఉద్యాన శాఖ కమిషనర్‌కు నివేదిక అందజేశామని ఆయన నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.