ఒత్తిడితో చిత్తయిపోతున్నారా.. జిల్లాలో పర్యాటక అందాలను ఓ చుట్టు చుట్టొస్తే పోలా.. ఉపశమనానికి అంతకుమించిన వేదిక లేదిక. జిల్లాలో పచ్చదనం కప్పుకొన్న పాపికొండలున్నాయి. గోదావరి పరవళ్లున్నాయి. కొల్లేరుకు వలసొచ్చే విదేశీ పక్షులు.. మన్యంలో జలపాతాల సొగసులు.. ద్వారకాతిరుమలేశుని దర్శనం.. పేరుపాలెం సముద్రతీరాన పర్యాటక ప్రభంజనం.. ఇలా ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే మరికొన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యాటకానికి తిరుగే ఉండదు.
చూడడానికి జిల్లాలో పర్యాటక అందాలెన్నున్నా ఆయా ప్రాంతాల్లో సరైన వసతులు, వెళ్లడానికి అనువైన రవాణా సౌకర్యాలు.. ముఖ్యంగా రక్షణ చర్యలు లేకపోతే ఎన్నేళ్లయినా ప్రగతి సాధ్యం కాదు. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే జిల్లాలో వసతుల పరంగా పర్యాటకం వెనుకబడి ఉందనే చెప్పాలి.
ఉదాహరణకు జాతీయ స్థాయిలో పేరుగాంచిన కొల్లేరు ప్రాంతానికి వెళ్లాలంటే కొత్తవారికి అయ్యేపని కాదు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకుంటే కానీ కుదరదు. మన జిల్లాలోని వారే చాలామంది నేటికీ కొల్లేరు చూడలేదంటే కారణం ఇదే కావొచ్ఛు పర్యాటక ప్రాంతాలను చూపిస్తూ వారికి మార్గదర్శనం చేసేలా పర్యాటకసంస్థ చర్యలు చేపడితే బాగుంటుందని తణుకుకు చెందిన యువకుడు టి.రాజేష్ పేర్కొన్నారు. ఒకదానితో ఒకటి కలుపుతూ రవాణా సౌకర్యాలున్నప్పుడే పర్యాటకులు పెరుగుతారని అభిప్రాయపడ్డారు. పొరుగున ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా ఏర్పాట్లు కొంత వరకు ఉన్నాయన్నారు.
![tourist places in west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tpg10_2501newsroom_1611558639_81.jpg)
● మన్యంలో ప్రాంతాలను చూడటానికి వెళ్లే పర్యాటకులకు రక్షణ కల్పించాలి. ఆలస్యమైతే అక్కడే ఉండటానికి కూడా వసతులు సమకూర్చినప్పుడే పర్యాటకంగా ప్రగతి సాధ్యపడుతుందని ఇటీవల హైదరాబాద్ నుంచి జిల్లాను సందర్శించడానికి వచ్చిన వి.గంగాధర్ చెప్పారు. కేరళ వంటి రాష్ట్రాల్లో పర్యాటకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయన్నారు.
జిల్లాలో పర్యాటక ప్రాంతాలు
పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల, ద్వారకాతిరుమల, పంచారా మాలు, ఎర్రకాలువ జలాశయం, గుంటుపల్లి గుహలు, జీలకర్రగూడెం, గుబ్బల మంగమ్మగుడి, పారిజాతగిరి, కొల్లేరు సరస్సు, పేరుపాలెం తీరం, కొవ్వూరు గోష్పదక్షేత్రం, పెదమల్లం రిసార్ట్స్, యలమంచిలిలంక, నరసాపురం గోదావరితీర ప్రాంతాలు.
ప్రత్యేక ప్రణాళికతో మేలు
ఇతర శాఖలకు ఉన్నట్లుగా పర్యాటకశాఖకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగడం లేదు. వార్షిక ప్రణాళిక రూపొందిచడం లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ చేయాల్సిన పనులకు సరిపడా నిధులు కేటాయిస్తే పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయంగా తయారుచేసే అవకాశం ఉంటుంది. నిధులొస్తే చూద్దాంలే అన్నచందాన కాకుండా ఉన్న నిధులతో ఎటువంటి పనులు చేయవచ్చో స్పష్టమైన కార్యక్రమాన్ని తయారుచేసుకునే అవకాశాన్ని పర్యాటకశాఖకు కల్పించాలి. తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం, ఉపాధి మార్గాలను సృష్టించుకోవడానికి మరింత అవకాశం లభిస్తుంది.
ఇదీ చదవండి: వేలివెన్నులో శ్రీరామభక్తుల పాదయాత్ర