ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్, నీటి సరఫరా పెను సవాళ్లుగా మారుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగి వాటి వాడకం అధికమై ఆలయ అధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్, నీటి సరఫరా సరిగా లేక యాత్రికులు, భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్కోడా టెక్నాలజీని ప్రవేశపెట్టారు. విద్యుత్, నీటి సరఫరా నియంత్రణ ఆయా అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లలో పొందుపరిచారు. ఎక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయినా వెంటనే వివిధ దశల్లో ఉన్న అధికారులకు తెలిసిపోతుంది. ఏ ఫీడర్లో ఎంత విద్యుత్ ఖర్చవుతోంది.. ఏ ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదన్న విషయాలు తెలుస్తాయి. సంబంధిత అధికారి బయట ఉన్నా.. తన మొబైల్ ఫోన్లో చూసుకునే వీలుంది. తద్వారా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం ఉంది.
నీటి సరఫరాలోనూ..!
స్కోడా సాంకేతికత కోసం అధికారులు, సిబ్బంది ప్రత్యేక యాప్‌ను వినియోగిస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్ల నుంచి ఫీడర్లు, రెగ్యులేటర్ల ఏర్పాటు వరకు అన్నింటిలోనూ అందుకు అనుగుణంగా మార్పులు చేశారు. నీటి సరఫరా విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. విద్యుత్, నీటి సరఫరా ఎలా సాగుతోందన్నది డిజిటల్ తెరపై కనిపించేలా విద్యుత్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.
మొదటి క్షేత్రం
స్కోడా టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొదటి దేవాదాయ ధర్మాదాయ పుణ్యక్షేత్రంగా ద్వారకా తిరుమల ఆలయం నిలిచింది. మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఈ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానం ప్రవేశపెట్టాక దాదాపు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా అయ్యిందని అధికారులు అంటున్నారు. అలాగే నీటి విషయంలోనూ ట్యాంకులు 90 శాతం నిండితే మోటార్లు వాటికవే ఆగిపోయేలా చర్యలు చేపట్టారు. ఈ స్కోడా సాంకేతికతను మిగతా ఆలయాల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా ఆలయాల అధికారులు ద్వారకా తిరుమలను సందర్శించి ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: