ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఏలూరులోని కలెక్టరేట్ నుంచి సమావేశంలో పాల్గొన్న ముత్యాలరాజు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిమిత్తం లేఅవుట్లను రూపొందించడం, ప్లాట్లు వేయడం చాలా వరకు పూర్తయిందన్నారు. పట్టాల పంపిణీకి ఇంకా అవసరమైన 130 ఎకరాల భూమిని త్వరితగతిన స్వాధీనం చేసుకోనున్నట్లు వివరించారు.
జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక బృందాలు ఇంటింటినీ సందర్శించి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నాయని, వైరస్ సోకిన లక్షణాలుంటే సదరు వ్యక్తులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో శానిటేషన్ చేయించడంతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను వాహనాల ద్వారా పంపిస్తున్నామన్నారు. 60 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారినుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు వివరించారు.
రేషన్ కార్డుదారులకు రెండో విడత రేషన్ పంపిణీ ప్రక్రియను ఈ నెల 16 నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా బియ్యం కార్డు పొందిన వారితోపాటు పాత రేషన్ కార్డు కలిగిన వారికీ సరకులు అందజేస్తామన్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆయా దుకాణాలను సీజ్ చేస్తున్నామన్నారు. వీడియో సమావేశంలో కొవిడ్-19 జిల్లా ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్, ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ నవదీప్‌సింగ్, జేసీ కె.వెంకటరమణారెడ్డి, జేసీ-2 ఎన్.తేజ్‌భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: