Vizianagaram Farmers Fear Severe Crop Loss: వరి కంకులతో పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు నెర్రెలు చాచాయి. ఏ కాలువ చూసినా చుక్కనీరు రాని పరిస్థితి. చుట్టూ చెరువులున్నా.. భానుడి భగభగలతో ఆవిరైపోతున్నాయి. అప్పులు చేసి మరీ రెక్కలుముక్కలు చేసుకుని పండించిన పంట.. కళ్లెదుటే ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అన్నదాతది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఇక ఏం చేయాలో తెలియక నువ్వే దిక్కు అంటూ దేవుడిపై భారం వేసి.. ఉన్న పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో కరవు ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా సాధారణ వరి సాగు విస్తీర్ణం లక్షా 25 వేల 386 హెక్టార్లు కాగా ఈ ఏడాది 99 వేల 874 హెక్టార్లలో సాగైంది. అదే విధంగా.. మన్యం జిల్లాలో 91 వేల 882 హెక్టార్లు ఉండగా.. 74 వేల 928 హెక్టార్లలో పండించారు.
Farmer Crying Due to Dying Crops in AP: నీరందక ఎండిన పంట.. కన్నీరుమున్నీరైన రైతు..
వర్షాలు ఆలస్యం కావటంతో ఇరు జిల్లాల్లోనూ మొక్కజొన్న, చెరకు తదితర పంటల సాగు.. సాధారణ విస్తీర్ణం కంటే తగ్గింది. ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనా.. జూన్లో 52 మిల్లీమీటర్లు, ఆగస్టులో 23 మీ.మీటర్ల లోటు వర్షపాతం నెలకొంది. నాట్లు వేయడానికే రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చినుకు జాడ లేదు. ఇది చాలదన్నట్లు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఖరీఫ్ పంటలు ఎండుముఖం పట్టాయి.
వరి వెన్ను, పొట్టదశలో ఉన్న సమయంలో పుష్కలంగా నీరు అవసరం. కానీ తీవ్ర ఎద్దడి కారణంగా పొలాలు బీటలు వారుతున్నాయి. రెండు జిల్లాల్లో 30 శాతం పంట దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా. వర్షాధార ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విజయనగరం జిల్లా తెర్లాం, మెరకముడిదాం, గుర్ల, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, గజపతినగరం మండలాల పరిధిలో వరి,చెరకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో.. వర్షాభావం కారణంగా సాలూరు, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, జియ్యంవలస వర్షాధార ప్రాంతాల్లో కరవు పరిస్థితి నెలకొంది. వానలు కురవక పంట పొలాలన్నీ నెర్రెలు చాచాయని రైతులు తల్లడిల్లుతున్నారు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు దిగులు చెందుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తే.. పశుగ్రాసం కూడా వచ్చేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జలాశయాల్లో ఉన్న నీటినైనా వాడుకుందామనుకుంటే.. రైతన్నలకు ఆ భాగ్యమూ లేదు. కాలువల నిర్వహణ సక్రమంగా లేక పొలాలకు సాగునీరందటం లేదు. చేసేదేమీ లేక ఆయిల్ ఇంజన్ల సహాయంతో నీటి తడులు అందిస్తున్నారు. దీనివల్ల ఖర్చు తడిసి మోపడవుతున్నా.. పంట చేతికొస్తుందో లేదోనని కలత చెందుతున్నారు.
Groundnut Farmers Removing Crop: కరవుతో 'అనంత' రైతు విలవిల.. ఎండిన పంటను తొలగిస్తూ కన్నీటి పర్యంతం