కేంద్ర ప్రభుత్వ త్రాగునీరు, పారిశుధ్య శాఖ (డిడబ్ల్యూఎస్ఇ) డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జవహరి నిర్వహించిన జూమ్ సమావేశంలో... విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవరహర్‌లాల్ పాల్గొన్నారు. ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమానికి సంబంధించి గ్రామాల ఎంపికపై సమావేశంలో పాల్గొన్న దేశంలోని 13 రాష్ట్రాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులతో మాట్లాడిన కలెక్టర్ హరి జవహర్లాల్, ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాన్ని త్వరతిగతిన పూర్తి చేసి.. గ్రామాలను క్లీన్ విలేజ్‌గా ప్రకటించాలని ఆదేశించారు. ఓడిఎఫ్ ప్లస్‌కు సంబంధించి ఆగస్టు 15 నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వస్తుందనీ, గ్రామాలను గుర్తించి అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఓడిఎఫ్ ప్లస్‌లో చేర్చేందుకు అన్ని ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానం, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానం, వంద ఇళ్లు దాటిన ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా ఒక సామూహిక మరుగుదొడ్డి, అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో మరుగుదొడ్లు ఉండాలని వివరించారు.
వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో పచ్చదనం పెంచాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని, దీనిని మొదటి స్థానానికి తీసుకురావాలని ఆదేశించారు.
జిల్లాలో 10,273 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సుమారు 2,500 పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి మిగిలినవాటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమం క్రింద 38 పంచాయితీలకు చెందిన 68 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, ఈ గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఓడిఎఫ్ ప్లస్‌లో గుర్తించిన గ్రామాలను శాశ్వతంగా క్లీన్ విలేజ్‌గా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: 'గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసుకుని పుక్కిలించండి'