Sirimanotsavam in Vizianagaram: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఘట్టం... అత్యంత వైభవంగా జరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించిన ఉత్సవానికి... లక్షలాది భక్తుల రాకతో విజయనగరం వీధులు కిక్కిరిసిపోయాయి. మంత్రి కొట్టు సత్యనారాయణ... ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
జై పైడితల్లి జై జై పైడితల్లి నామస్మరణతో విజయనగరం మార్మోగింది. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లిగా ఖ్యాతి గడించిన పైడితల్లమ్మ వారి సిరిమానోత్సవం అశేష భక్తజనం నడుమ కన్నుల పండువగా జరిగింది. రెండేళ్లుగా కరోనాతో నిరాడంబరంగా సాగిన సిరిమానోత్సవం ఈసారి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల కోలాహలం మధ్య సందడిగా సాగింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి జనం బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ.... పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సభాపతి తమ్మినేని సీతారాం, ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు... కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పూసపాటి వంశీయులైన అశోక్‌గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు.
పూజారి బంటుపల్లి వెంకటరావు రూపంలో సిరిమాను అధిరోహించిన అమ్మవారిని చూసేందుకు... మధ్యాహ్నం ఒంటి గంటకే భక్తులు ఉత్సవ వీధులకు చేరుకున్నారు. 3గంటలకు ప్రారంభం కావాల్సిన సిరిమానోత్సవం... రెండున్నర గంటల ఆలస్యంగా ఐదున్నరకు మెుదలైంది. ఆర్డీవో సూర్యకళ రథం తాడు లాగి సిరిమాను సంబరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సిరిమానుకు ముందుభాగంలో పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల... ఒకదాని వెంట మరొకటి నడిచాయి. భక్తులు జేజేల నడుమ చదురు గుడి నుంచి విజయనగరం కోట వరకు మూడుసార్లు సిరిమాను రథం తిరిగింది. ఎత్తైన భవనాల పైకి ఎక్కిన భక్తులు... సిరిమాను సంబరాన్ని కనులారా తిలకించారు. ఉత్సవం ఆలస్యం కావడంతో కొంత ఇబ్బంది పడ్డారు.
ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు కుటుంబీకులు, ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతి, ఇతర కుటుంబ సభ్యులు... కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించారు. డీసీసీబీ భవనంపై నుంచి మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్ సూర్యకుమారి, ఇతర ప్రభుత్వ అధికారులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు.
పైడితల్లి సిరిమానోత్సవం సాక్షిగా రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణపై అధికార, ప్రతిపక్షాల పరసర్పం విమర్శలకు దిగాయి. విశాఖను పాలన రాజధాని చేసేందుకు ప్రభుత్వానికి కరుణాకటాక్షాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి కొట్టు చెప్పగా... విశాఖ ఉక్కును విక్రయిస్తుంటే మంత్రులు ఎందుకు అడ్డుకోలేదని తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు.
ఇవీ చదవండి: