రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలని గ్రామీణ ప్రాంతాల యువకులు అమితాసక్తి చూపుతుంటారు. వాటికి సంబంధించిన పోటీలు ఎక్కడ జరిగినా క్యూ కడుతుంటారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ... దేహదార్ఢ్య పరీక్షల్లో విఫలమై చాలా మంది ఉద్యోగాలకు దూరమవుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలానికి చెందిన ఇలాంటి యువతకు రమణ, శంకరరావు... అండగా నిలుస్తున్నారు. ఆర్మీ జవాన్లుగా ఉద్యోగ విరమణ పొందిన వీరు... ఇప్పుడు గ్రామాల్లో ఉన్న యువతను దేశసేవకు ప్రోత్సహిస్తున్నారు.
నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామానికి చెందిన రమణ, సీతారామునిపేటకు చెందిన శంకరరావు... ఆర్మీ జవాన్లుగా 17 ఏళ్లు దేశసేవ చేశారు. కొన్ని నెలల కిందట ఉద్యోగ విరమణ పొందారు. పేద కుటుంబంలో పుట్టి ఆర్మీలో చేరేందుకు వారు గతంలో పడ్డ ఇబ్బందులు... తమ మండలంలో మరెవరూ పడకూడదనే ఉద్దేశంతో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే యువతకు శిక్షణ ఇస్తున్నారు. సీతారామునిపేట యువకులతో పాటు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన దాదాపు 70మందికి శంకరరావు రెండు వేళల్లో తర్ఫీదునిస్తున్నారు. రమణ 50 మందికి శిక్షణిస్తున్నారు.
వేకువజామునే 5 కిలోమీటర్ల పరుగు మొదలుకుని... లాంగ్‌జంప్, హైజంప్, పుషప్స్ వంటి వ్యాయామాలు చేయిస్తున్నారు. వారానికోసారి 15 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించి.. ప్రతిభ కనబరిచినవారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. వారిద్దరూ ఉచితంగా అందిస్తున్న శిక్షణపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో కఠినంగానే అనిపించినప్పటికీ క్రమంగా అలవాటు పడ్డామని, ప్రస్తుతం తమలో ఆత్మవిశ్వాసం మెరుగైందంటున్నారు. యువతకు స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తున్న రమణ, శంకరరావులకు ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగులు, దాతలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు.
ఇదీ చదవండీ... 'స్వచ్ఛ సర్వేక్షన్ కోసం స్టీల్ సిటీలో సమగ్ర వ్యర్థ నిర్వహణ చర్యలు'