పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ సిబ్బందికి "రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రాజకుమారి "రన్ ఫర్ యూనిటీ" ముగింపు పాయింట్ వద్ద పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.
అందుకోసమే సంస్మరణ..
విధి నిర్వహణలో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరుల సంస్మరణార్థం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి 31 వరకు అమర వీరుల సంస్మరణ దినోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజలకు తెలియజేయాల్సిందే..
రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంతో పోలీసులు చేసిన త్యాగాలను, నిర్వహించే కఠినమైన విధుల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో భాగంగా నిర్వహించిన విధుల్లో ముద్దాడ గాంధీ, చిట్టిపంతుల చిరంజీవరావు, షేక్ ఇస్మాయిల్, బి. శ్రీరాములు, ఎస్ సూర్యనారాయణలను కోల్పోయామన్నారు.
ప్రాణాలు పోయినా సరే..
శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను కోల్పోయినా, విధి నిర్వహణలో ఎటువంటి విధులకైనా వెనుకాడబోమన్నారు. ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు మనమంతా అండగా ఉండాలని సూచించారు. ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, పాఠశాలల్లో డిబేట్, చిత్ర లేఖనం పోటీలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
చిరస్థాయిగా..
పోలీస్ అమరవీరులు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని జిల్లా ఎస్పీ కొనియాడారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని మహిళా పోలీస్ సిబ్బందికి వేరుగా నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. సత్యన్నారాయణ రావు, ఒఎస్డీ ఎన్.సూర్యచంద్ర రావు, ఎఆర్డిఎస్పీఎల్ శేషాద్రి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు, పీసీఆర్ డీఎస్పీ సుభద్రమ్మ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.