అక్టోబరు 26, 27వ తేదీల్లో జరగనున్న విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగను నిర్వహించాలని అధికారులకు సూచించారు. పైడిమాంబ ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని ఈ సారి విభిన్నంగా, వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆలయ నిబంధనలను, సంప్రదాయాలను పాటిస్తూనే....ఉత్సవంలో కొత్తదనం కనిపించేలా చూడాలన్నారు. దానికి తగ్గట్టుగా విద్యుత్ దీపాలంకరణ, వివిధ కూడళ్లను తీర్చిదిద్దడం, రోడ్ల విస్తరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. అలాగే గత రెండేళ్లుగా విజయనగరం పట్టణంలో జరిగిన అభివృద్ది.... నాటికీ, నేటికీ వచ్చిన మార్పు కనిపించాలన్నారు.
భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ ముఖ్యం
పట్టణ పరిధిలోని చారిత్రక, ప్రభుత్వ కట్టడాలతోపాటు.... ప్రతీ దేవాలయాన్ని, షాపింగ్ మాల్స్, హొటల్స్‌ను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు దర్శనానికి ఎక్కడా ఇబ్బంది పడకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. పైడితల్లి అమ్మవారి జాతర రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవమని... ఆ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేయాలని....పనులన్నీ విజయదశమి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయానుసారం అమ్మవారి ఉత్సవ నిర్వహణ ఎంత ముఖ్యమో.... భక్తుల ఆరోగ్యం, భద్రత కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ప్రతి రోజూ పదివేల మంది భక్తులకు అనుమతి'