విజయనగరం జిల్లాలో వైఎస్సార్ బీమా పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ హరి జవహర్‌లాల్ సమావేశం నిర్వహించారు. పేదలకు రక్షణ కల్పించి, భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి బీమా పథకాన్ని వర్తింపజేయాలని కోరారు.
జిల్లాలో పథకం అమలు వివరాలను డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు కలెక్టర్కు తెలిపారు. జిల్లాలో మొత్తం 6,51,164మంది వైఎస్సార్ బీమా పొందేందుకు అర్హులని చెప్పారు. సర్వే ద్వారా ఇప్పటివరకు 5,83,783 మందిని గుర్తించామన్నారు. వీటిలో 3,87,691 దరఖాస్తులను ఇప్పటికే బ్యాంకులకు సమర్పించామని చెప్పారు. మరో 4వేల మందికి బ్యాంకుల్లో ఖాతాలను తెరవాల్సి ఉందన్నారు. పథకం అమలులో బ్యాంకులు, ఇతర శాఖల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కలెక్టర్కు వివరించారు.
పథకం అమలును సామాజిక బాధ్యతగా భావించి సంబంధిత శాఖల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు. చెక్ లిస్టును తయారు చేసి, దాని ఆధారంగా దరఖాస్తులను గ్రామ సచివాలయాల్లోనే ముందుగా పరిశీలించాలని సూచించారు. వెలుగు లేదా మెప్మా సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకు ఈ బాధ్యతను అప్పగించాలన్నారు. మిగిలిన అర్హుల నుంచి దరఖాస్తులను సత్వరమే సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, బ్యాంకు ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, వెలుగు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సంచార లైబ్రరీలో ఆసక్తికరమైన పుస్తకాలు..!