కొవిడ్ మహమ్మారి సమయంలో రైల్వే ఆదాయానికి గండి పడింది. కొత్త అదాయ మార్గాలవైపు దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖ డివిజన్లకు సూచించింది. ఈ క్రమంలో వాల్తేర్ డివిజన్ ఒక్క రోజులోనే ఏడున్నర కోట్ల రూపాయిల విలువైన ఇనుము తుక్కును ఒక్కరోజులో వేలం వేసి రికార్డు సృష్టించింది.
విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్లో వివిధ యార్డుల్లో తొలగించిన పట్టాలు, స్లీపర్లు, ఇతర పాత ఇనుప సామగ్రిని దాదాపు రెండు వారాలుగా మెటీరియల్స్ విభాగం గుర్తించింది. వందల టన్నుల ఇనుము తుక్కును సోమవారం ఆన్లైన్లో వేలానికి ఉంచింది. కొనుగోలు చేసేందుకు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఆసక్తి కనబర్చారు. ఫలితంగా ఒక్క రోజులోనే 7 కోట్ల 43 లక్షల రూపాయిలను వేలం ద్వారా సమకూర్చుకుంది వాల్తేరు డివిజన్.
డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, మెటీరియల్స్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ బి.తిరుపతయ్య, ఇతర ఉన్నతాధికార్ల బృందం.. వృథాగా పడి ఉన్న ఇనుము లాట్లను కొద్ది సమయంలోనే పెద్ద ఎత్తున గుర్తించగలిగింది. పెద్ద ఎత్తున ఇనుము తుక్కు అన్లైన్లో అమ్ముడుపోవటం, ఆదాయం గణనీయంగా సమకూరడం పట్ల రైల్వే వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రానున్న వారాల్లో మరింత తుక్కును గుర్తించి వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.