Kidney Transplantation: రాష్ట్రంలో కిడ్నీ విక్రయాలు కలకలం రేపుతున్నాయి. బాధితుల ఆర్థిక ఇబ్బందులను దళారులు ఆసరాగా చేసుకుని.. వారి కష్టాలను తీరుస్తామని చెప్పి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈనెల 14న ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నీలను ఏపీ అవయవ దాన అధికారుల అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చేశారు. ఆ ఘటన మరువక ముందే కేవలం 15రోజుల వ్యవధిలో విశాఖలో మరో ఘటన వెలుగు చూడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కిడ్నీ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చునని నమ్మించి మోసగించిన వ్యక్తిపై విశాఖ నగర పరిధిలోని పీఎం పాలెం పోలీసు స్టేషన్లో బాధితుడు బుధవారం ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలోని మధురవాడ వాంబే కాలనీకి చెందిన క్యాబ్ డ్రైవర్ జి. వినయ్ కుమార్ (32)కు స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఉద్యోగి కామరాజు (44) తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే తన ఆర్థిక ఇబ్బందులను కామరాజుకు వినయ్ కుమార్ వివరించాడు. వాటి నుంచి బయట పడాలంటే వినయ్‌కు ఉన్న రెండు కిడ్నీల్లో ఒకటి విక్రయిస్తే రూ.8.50 లక్షలు ఇప్పిస్తానని కామరాజు చెప్పాడు. అందుకు అంగీకరించిన వినయ్ కుమార్ నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి కిడ్నీ ఇవ్వడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.
అయితే కొడుకు కిడ్నీ అమ్ముకుంటున్నాడన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దంటూ అతడిని హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపించారు. తర్వాత వినయ్ కుమార్‌ని కామరాజు బెదిరించాడు. కిడ్నీ ఇవ్వడానికి రాకుంటే వినయ్ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడి నగరానికి వచ్చిన వినయ్ కుమార్‌ను సోమవారం కామరాజు పెందుర్తిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఒక కిడ్నీ తీయించాడు. అయితే ముందే అనుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇచ్చి కామరాజు మాయమయ్యాడు. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు పీఎం పాలెం స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని ఈ కేసును పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ ఘటనను వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని.. అంతేకాకుండా మరిన్ని వివరాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నేడు ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు.
ఇవీ చదవండి: