Local Boy Nani Vizag Fishing Harbour Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల ప్రమాదంపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విశాఖ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదని, వేరే ప్లేస్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చానని నాని తెలిపారు. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు బోట్లు తగల బడుతున్నట్టు తనకు ఫోన్ వచ్చిందని అన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తాను హార్బర్‌కు వెళ్లానని.. తాను అక్కడికి వెళ్లే సమయానికి బోట్లు తగలబడుతున్నాయని చెప్పారు.
జీవితాలను చిన్నాభిన్నం చేసిన ప్రమాదానికి కారణాలు ఏంటి? - వారిని ఆదుకునేది ఎవరు?
తాను అప్పటికే మద్యం తాగి ఉన్నానని, తాను హార్బర్‌కు వెళ్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిందని తెలిపారు. ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమేనని వివరించారు. వీడియోలు తీస్తున్న తనను కొందరు కొట్టే ప్రయత్నం చేశారన్నారు. వీడియో తీసి పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని అన్నారు.
YouTuber Local Boy Nani Comments on Police: పోలీస్ విచారణ కోసం రావాలని కోరటంతో వెళ్లానని పిటిషనర్ నాని తెలిపారు. తాను బోట్లు తగలబెట్టానంటూ తనపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు. ప్రమాదం జరిగే సమయంలో తాను ఓ హోటల్లో ఉన్నానని.. ఆ హోటల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో తాను ఉన్నానని తెలిపారు. కోర్టులో పిటిషన్ వేయకపోతే పోలీసులు తనను అంతం చేసే వారని నాని అన్నారు.
కాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయి. ఒక బోటుతో మొదలైన మంటలు మిగితా బోట్లకు కూడా వేగంగా వ్యాపించడంతో.. మిగిలిన బోట్లను అక్కడి నుంచి తరలించలేకపోయారు. దీనిపై సీఎం జగన్ విచారణకు ఆదేశించగా.. తొలుత యూట్యూబర్ నానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదం జరిగి రెండురోజులైనా మారని దుస్థితి - విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద దయనీయ పరిస్థితి
"నన్ను నాలుగు రోజులు ఉంచారు. తెల్ల పేపర్లపై నాది, నా భార్యది సంతకాలు పెట్టించుకున్నారు. దానిపై తేదీలు కూడా ఏం లేవు. నాకు చాలా భయం వేసింది. నా దగ్గరకి వచ్చి.. పిటిషన్ వెనక్కి తీసుకోమన్నారు. లేదంటే విశాఖపట్నంలో నువ్వు తిరగడం చాలా కష్టం అవుతుంది.. తరువాత నువ్వు చాలా బాధ పడతావు అని అన్నారు. అంతే కాకుండా వీడియోలు చేయొద్దు అని, ప్రెస్ వాళ్లకి ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వద్దని చెప్పారు.
కానీ మీకు ఇప్పుడు సమాధానం చెప్పకపోతే నేను ఇప్పటికీ ముద్దాయిలాగే ఉంటాను. అందుకే నేను నా బాధను ఇప్పుడు చెబుతున్నాను. లేదంటే ప్రజలు కూడా నేనే ఈ ప్రమాదం చేశాను అని అనుకుంటారు. నాకు అస్సలు ఏం తెలియదు. అన్ని రికార్డులు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. నా ఫోన్ ట్రాకింగ్, నేను ఎక్కడకి వెళ్లాను అన్నీ కూడా వాళ్ల దగ్గర ఉన్నాయి. నేను ఏం తప్పూ చేయలేదు. హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను". - నాని, యూట్యూబర్
అగ్నిప్రమాదంతో రోడ్డునపడ్డ వందలాది కుటుంబాలు - న్యాయం చేయాలంటూ బోరున విలపిస్తున్న బాధితులు