IT Enquiry on Minister Mallareddy Assets : తెలంగాణలో టీఆర్‌యస్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సోదాల కేసులో ఇవాళ్టి నుంచి ఆదాయ పన్ను శాఖ విచారణ చేపట్టనుంది. మల్లారెడ్డి ఆస్తులపై తనిఖీలు పూర్తయిన తర్వాత సమన్లు జారీ చేసిన 16 మంది నుంచి వివరణ రాబట్టేందుకు రంగం సిద్ధమైంది. వీరిని మూడు రోజులు.. అంతకంటే ఎక్కువ రోజులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఐటీ సోదాల సమయంలో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు సంబంధించి.. స్వాధీనం చేసుకున్న రషీదులు, దస్త్రాలు, నగదు, బంగారం లాంటి వాటిపై ఆరా తీయనున్నారు. అధికారులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోనున్నారు.
మల్లారెడ్డి వస్తారా..: మొదటి రోజైన నేడు.. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను పిలిపించి వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఐటీ శాఖ సమన్లు అందుకున్నప్పటికీ మంత్రి మల్లారెడ్డినే ఐటీ అధికారుల వద్ద హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆయన తరఫున చార్టెడ్ అకౌంటెంట్ లేదా ఆయన ఆథరైజ్ చేసిన వ్యక్తి హాజరై ఐటీ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వొచ్చు. ఈ వెసులుబాటు ఉన్నందున.. మల్లారెడ్డి ఐటీ కార్యాలయానికి వస్తారా.. ఆయన తరఫున ఇంకెవరైనా వస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే మల్లారెడ్డికి సంబంధించి విచారణ నిర్వహించే సమయంలో.. 2018 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌పై వివరణ అడిగే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ లెక్కలన్నీ సిద్ధం..: సమన్లు జారీ చేసిన వారికి సంబంధించి ఐటీ రిటర్న్సు, ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఎన్నికల అఫిడవిట్లు కూడా ఐటీ అధికారులు సిద్ధం చేసుకున్నారని తెలిసింది. వీటన్నింటిని దగ్గర ఉంచుకుని ఆరా తీసేందుకు డీడీఐటీ యాకున్ చంద్ నేతృత్వంలో ఓ అధికారుల బృందం ఏర్పాటైనట్లు తెలుస్తోంది.
రెండు నుంచి మూడు నెలలు..: ఇవాళ మొదలయ్యే విచారణ కనీసం మూడు రోజులు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. విచారణ చేసే సమయంలో ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే.. ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని.. మరో రెండు మూడు రోజులు సమయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సమన్లు జారీ చేసిన ఐటీ అధికారులు వారు స్వాధీనం చేసుకున్న వాటికి సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్నా.. మళ్లీ మళ్లీ సమన్లు జారీ చేసి తమ కార్యాలయానికి పిలిపించుకుని వివరణ తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ కేసు పూర్తి స్థాయిలో పరిశీలన.. డిమాండ్ రైజ్ చేసేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలలు పడుతుందని.. అప్పటి వరకు అవసరమైన ప్రతిసారీ సమన్లు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
ఇవీ చూడండి..
ఉపకులపతుల నియామకాల్లో జాప్యం..
భర్త హత్య.. ఫ్రిడ్జ్‌లో 22 శరీర భాగాలు.. దిల్లీలో మరో 'శ్రద్ధ' తరహా దారుణం
ఆ విషయంలో BCCI, PCB కలిసి నిర్ణయం తీసుకోవాలి: గౌతమ్ గంభీర్