విశాఖ జిల్లా ఎస్. రాయవరం మండల కేంద్రం మహాకవి గురజాడ జన్మస్థలంలో మరపురాని విధంగా ఐదు రోజుల పెళ్లితో ఒక్కటైంది ఓ జంట. పురాతన సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కల్యాణం ప్రత్యేకతను సంతరించుకుంది. వినూత్నంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. లక్ష మందికి పైగా రావటంతో ఈ వివాహ మహోత్సవం జాతర వేడుకగా మారింది.
ఎన్నెన్నో విశిష్టతలు...
ఎస్. రాయవరం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తెను బయ్యవరం గ్రామానికి చెందిన మరో వ్యాపారి కుమారుడికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఐదు రోజులపాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. 10 ఎకరాల కొబ్బరి తోటలో తాటాకు పందిరి వేయించారు. విశాలంగా కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. ఒకేసారి 20 వేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇటుకలు, మట్టి, ఆవు పేడతో అలికి పెళ్లి అరుగు తయారు చేశారు. పెళ్లి విశిష్టతను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని రకాల పండ్లతో పెళ్లి పందిరిని అలంకరించారు. తాళపత్ర గ్రంథంలో శుభలేఖలు అచ్చు వేయించారు. ఎన్నో విశిష్టతలకు నిలయంగా ఈ వివాహాన్ని జరిపించారు. ఊహించని విధంగా ఈ వేడుకలు చూసేందుకు జనం తండోపతండాలుగా తరలిరావటంతో గ్రామంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇదీ చదవండి:
సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..!