విశాఖ జిల్లా దేవరాపల్లిలో ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ధర్నా చేశారు. పెందుర్తి ప్రాంతంలో దళిత యువకుడి శిరోముండనం ఘటనను అంబేడ్కర్ యూత్ సంఘం, సీపీఎం, గిరిజన సంఘాల నిరసన చేపట్టారు. సెల్ ఫోన్ దొంగిలించాడన్న నెపంతో ఎస్సీ యువకుడ్ని చితకబాది, శిరోముండనం చేసిన ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఎస్సీ యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసిన సంఘటన మరవక ముందే విశాఖలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఎస్సీ, గిరిజనులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని... చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అంబేడ్కర్ యూత్ సంఘం అధ్యక్షులు కాటపల్లి అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం నాయకుడు రాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. బంధువులకు భయం... స్థానికులు సానుభూతికే పరిమితం..