విశాఖలో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించి ఆటోలు నడుపుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. చాలామంది డ్రైవర్లు రోడ్లపైకి వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసులు లేనందున ప్రతి ఒక్కరూ ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నారు. అదే విధంగా కేవలం ఇద్దరినే ఆటోలో ఎక్కించాలన్న నిబంధననూ కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. ఈ నిబంధనతో తమకు డీజిల్ చార్జీలు రావట్లేదని ఆటోడ్రైవర్లు అంటున్నారు.
ఈ క్రమంలో చార్జీలను పెంచి ఆటోలు నడుపుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. విశాఖ నగర పరిధిలో ఆటో డ్రైవర్లు కనీస ఛార్జీని రూ.5 నుంచి రూ. 10 కి పెంచారు. 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రూ. 10 వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకైతే ఛార్జీలను రెట్టింపు చేశారు. మొన్నటి వరకు షేర్ ఆటోకి ఎన్‌ఏడీ నుంచి పెందుర్తికి రూ. 60 తీసుకున్నారు.
ఛార్జీలు మరీ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావటంతో మళ్లీ తగ్గించారు. పోలీసుల నిఘా లేని చోట మాత్రం నలుగురైదుగురిని ఎక్కించుకుంటున్నారు. డీజిల్ ఖర్చులకైనా రావాలని కొన్నిసార్లు ముగ్గురు, నలుగురితో వెళ్తే పోలీసులు కేసులు రాస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనా నిబంధనలు పాటించాల్సిందే. భౌతిక దూరం పాటించకుంటే మహమ్మారి చుట్టుముడుతుంది. అలా అని ప్రయాణికులపై అదనపు భారం మోపడం సరికాదని నగరవాసులు అంటున్నారు.
ఇదీ చదవండి: