AP High Court Judge couple visiting Visakha Saradapeetham: గత రెండు రోజులక్రితం ప్రారంభమైన విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మూడో రోజున(ఆదివారం) ఆలయ అర్చకులు నిర్వహించిన.. లోక కళ్యాణార్ధం రుద్ర హోమం, వనదుర్గా హోమాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ దంపతులు పాల్గొని రాజశ్యామలా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల ఆలయాలను సందర్శించి.. యాగంలో పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్ల ఆశీస్సులను అందుకున్నారు.
పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్న మంత్రి, ఎమ్మెల్యే: ఈ వేడుకల్లో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉత్సవాల్లో పాల్గొని.. పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామివారి సూచనల మేరకు.. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో దధి(పెరుగు) నివేదన ఆరంభించారు. దీనిపై మంత్రి వేణు చొరవను స్వామీజీ అభినందించారు. కుండలో ఉంచిన పాలకు తోడు పెట్టి నివేదన సమర్పిస్తే.. విగ్రహాలు పాడవకుండా ఉంటాయని సంతోషం వ్యక్తం చేశారు.
ముగిసిన చాత్తాడ శ్రీ వైష్ణవ ఆగమ సదస్సు: మరోపక్క టీటీడీ చేపట్టిన చతుర్వేద హవనం వేదోక్తంగా సాగుతోంది. మూడు రోజులపాటు నిర్వహించిన చాత్తాడ శ్రీ వైష్ణవ ఆగమ సదస్సులు ముగిశాయి. అర్చక అకాడమీ డైరెక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సదస్సులను నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న విద్యార్ధులకు పీఠం తరపున ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తన స్వహస్తాలతో ప్రోత్సాహక సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈఓ సాగర్ బాబుతో పాటు ఆలయ పండితులు పీఠానికి వచ్చి శివరాత్రి వేడుకలకు హాజరు కావాల్సిందిగా స్వాములను కోరారు.
త్వరలో విశాఖ శారదాపీఠం ఆగమ పాఠశాల: విశాఖ శ్రీ శారదాపీఠంలో త్వరలోనే వైష్ణవ ఆగమ పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు.. ఆ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఇప్పటికే పీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల ద్వారా విద్యార్ధులకు స్మార్తంతో పాటు.. రుగ్వేదం, యజుర్వేదం నేర్పుతున్నామన్నారు. తమ గురువులు స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం మేరకు త్వరలోనే వైష్ణవ ఆగమ సదస్సును ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యామన్నారు. ఆలయ సంస్కృతిని ద్విగుణీకృతం చేసే ఆగమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆలయం ఉన్నంతవరకు ఆగమం ఉంటుందని, ఆలయం ఉంటేనే ధర్మం నిలబడుతుందని స్వాత్మానందేంద్ర స్వామి స్పష్టం చేశారు. ఆగమ, వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులతో మూడు రోజులపాటు నిర్వహించిన చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో చిర్రావూరి శ్రీరామ శర్మ, విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఈ సదస్సును నిర్వహించారు.
ఇవీ చదవండి