AU Three Security guards arrested: భారతదేశంలో కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన విశ్వ విద్యాలయాలలో ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విశ్వ విద్యాలయం విశాఖపట్టణంలో ప్రారంభమైన రోజు నుంచి ఈనాటి వరకు ఎందరో విద్యార్ధిని, విద్యార్థులకు విద్యను అందిస్తూ వస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వారు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడి.. విశ్వ విద్యాలయం కీర్తిని నలుదిక్కులా చాటారు.
ఇంతంటి చర్రిత కలిగిన విశ్వ విశ్వవిద్యాలయం గతకొన్ని రోజులుగా అనేక విమర్శలకు గురవుతోంది. గంజాయి, అక్రమాలకు అడ్డాగా మారుతోంది. విశ్వ విద్యాలయంలో విద్యార్థులను నిత్యం కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బందే.. గంజాయిని విక్రయించడం కలకలం సృష్టిస్తోంది. విశ్వ విద్యాలయంలో గంజాయితో ఏకంగా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా విస్మయానికి గురి చేస్తోంది. విశ్వ విద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్న సంఘటన వెలుగులోకి రావడంతో విశాఖపట్టణ వాసులను, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కంచే చేను మేసిందన్న చందంగా, కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బందే గంజాయి విక్రయించడం.. అందులోనూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డ్రైవర్ ప్రధాన సూత్రదారి కావడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది వద్ద అరకిలో గంజాయి పట్టుబడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, నగరవాసులు విస్తుపోయారు. కొంతకాలంగా విశాఖ జిల్లా నుంచి వేరే ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారని.. విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ఐతే ఇప్పుడు నేరుగా విశ్వవిద్యాలయం భద్రతా సిబ్బందే గంజాయితో పట్టుబడటంపై.. విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఘటన తర్వాత వీసీ ప్రసాద్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన విద్యార్థి నేతలు.. వర్సిటీని నాశనం చేయవద్దని కోరుతున్నారు.
ఆంధ్ర వర్సిటీలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకం జరుగుతోంది. వర్సిటీ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్సే గంజాయి అమ్ముతున్నారంటే వర్సిటీ స్థాయి ఎంతవరకు క్షిణించిందో స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ వర్సిటీ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ చదువుకున్నారు. అటువంటి విశ్వవిద్యాలయంలో గంజాయి అమ్మకం ఘోరమైన దౌర్భాగ్యం. -ప్రకాష్, ఏయూ పూర్వ విద్యార్థి
పట్టుకున్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించి వారి వెనక ఎవరున్నారో తేల్చాలని.. విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని. ఇందుకు ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు. ప్రస్తుత ఘటనతో పాటు ఏయూలో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలపైనా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి