గిరిజన భాషలకు లిపులు రూపొందించే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు ప్రసన్నశ్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన భాషలకు లిపి రూపొందించిన తొలి మహిళా ఆచార్యులు. గిరిజన వికాసమే లక్ష్యంగా వారి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు ప్రసన్నశ్రీ. వివిధ తెగల మాట్లాడే భాషలను నిశితంగా గమనించారు. చాలా భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని గుర్తించారు. వాటిని కాపాడేందుకు ఏదైనా చేయాలని ఆలోచించారు.
ఎంతగానో శ్రమించి తొలుత ఒక భాషకు అక్షరమాల తయారు చేశారు. తర్వాత ఒక్కొక్క భాష పెంచుకుంటూ … పదేళ్లలోనే మొత్తం 19 భాషలకు లిపులు సృష్టించారు. గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన జరిగితే వారి మనోవికాసానికి తోడ్పతుందని ప్రసన్నశ్రీ అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా వారి భాషా, సంస్కృతులు పదికాలాల పాటు నిలుస్తాయన్నది ఆమె ఆశ.
భారత్‌తో పాటు ఆఫ్రికా, యూరప్ ఖండంలోని దేశాలలోని పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు ప్రసన్నశ్రీ చేస్తున్న కృషిని గుర్తించి ఎప్పటికప్పుడు ఆమెకు ప్రశంసలు అందిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇథియోపియా గోండార్ విశ్వవిద్యాలయం ఈమెను ప్రత్యేకంగా అభినందించింది. గూగుల్ సంస్థ ప్రసన్నశ్రీ రూపొందించిన 19 గిరిజన లిపిలను తమ వెబ్‌సైట్లలో ప్రాధాన్యం కల్పించింది.
అంతరించిపోతున్న గిరిజన భాషలకు సంబంధించిన అట్లాస్ ను రూపకల్పన చేసిన భారతీయ మహిళగా ప్రసన్నశ్రీకి ఎన్‌డేంజర్డ్ అల్ఫాబెట్ అట్లాస్ గుర్తింపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 90కి పైగా అంతరించిపోతున్న భాషల్లో 40 భాషలు భారత్ నుంచే ఉన్నాయి. వీటిల్లోనూ 19 ప్రసన్నశ్రీ లిపులు రూపొందించిన గిరిజన భాషలే కావడం విశేషం.
ఇదీ చదవండి: