భారతదేశంలో ఏఐటీయూసీ 100 ఏళ్లు నిండిన సందర్భంగా భీమునిపట్నం జోన్ పరిధిలోని తగరపువలసలో చిట్టివలస లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లు బాబూరావు పతాకావిష్కరణ చేశారు. అనంతరం కార్యాలయం నుంచి తగరపువలస జాతీయ రహదారి వరకు కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.
భారతదేశంలో కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు మొట్టమొదటిగా 1920 అక్టోబర్ 31వ తేదీన బొంబాయి నగరంలో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ ఏర్పడిందన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్మిక సంఘం దేశంలో మరొకటి లేదన్నారు. సంఘం స్థాపన నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలెన్నో చేస్తోందన్నారు. కార్మిక చట్టాలన్నీ ఏఐటీయూసీ పోరాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించినవేనన్నారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యజమానులకు అనుకూలంగా మార్పులు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలు పెంచకుండా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ చర్యలను తిప్పికొడుతూ దేశంలో అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి నవంబర్ 26వ తేదీన సార్వత్రిక సమ్మె పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఈశ్వరరావు, అప్పలసూరి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.