AP Crime News: తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీకాళహస్తి రోడ్డు అనుకుని ఉన్న ధాన్యం గోదాములో సుమారుగా 50 సంవత్సరాలు ఉన్న మహిళ మే 2న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును నాయుడుపేట పోలీసులు ఛేదించారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ధాన్యాన్ని నిల్వ ఉంచే గోదాములో బిహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీలు పని చేస్తూ ఉంటారని, వీరు గుర్తు తెలియని మహిళను తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం వీరందరూ రెండోసారి శారీరకంగా కలుసుకునేందుకు ప్రయత్నం చేశారని, ఆమె నిరాకరించడంతో వారు ఆగ్రహించి, మహిళను కొట్టి చంపేశారనీ డీఎస్పీ చెప్పారు.
మహిళ మృతదేహం ఎవ్వరికీ కనిపించకుండా ఉండటానికి గోతాళ్ల బేళ్ల కింద పడేసి పారిపోయారని తెలిపారు. తరువాత కొన్ని రోజులకు గోదాము ఖాళీ చేస్తుండగా మహిళ మృతదేహం బయటపడిందని చెప్పారు. పూర్తి వివరాలు సేకరించి అత్యాచారం, హత్య జరిగిన తీరును చూసి బృందాలుగా విడిపోయామని, ఈ క్రమంలో బిహార్‌కు చెందిన 6 మందిని అరెస్టు చేశామని, వారిని కోర్టులో హాజరుపరిచామని ఆయన తెలిపారు.
"గోదాములో ఓ మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని గుర్తించడానికి ఆనవాళ్లు ఏమీ లేవు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశాము. ఈ కేసులో బిహార్‌కు చెందిన 6 మందిని అరెస్టు చేశాం"- రాజగోపాల్ రెడ్డి, డీఎస్పీ
మహిళపై అత్యాచారం..!: బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారందరూ పరారయ్యారు. బాధితురాలు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసుల బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే మహిళ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
టాటూ ఆధారంగా దొంగను పట్టుకున్న పోలీసులు : తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగను వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పట్టణంలో ఒకే రోజు నాలుగు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన దొంగ కోసం పోలీసులు అన్వేషించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన గొల్లకుమార్‌ను అరెస్ట్ చేశారు. నిఘా కెమెరాలో లభ్యమైన టాటూ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మైదుకూరు బస్టాండులో అరెస్ట్ చేసినట్లు సీఐ బీవీ చలపతి తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, అన్నమయ్య జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాదులో కలిపి 47చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. దొంగ నుంచి ఒక సెల్‌ఫోన్, బ్లూ టూత్, 4 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
ఇవీ చదవండి