Villagers protested against chemical industry: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామంలో నాగార్జున అగ్రికెమ్ అండ్ మల్టీ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించబోయే పరిశ్రమలో తయారయ్యే ఆగ్రో కెమికల్, సింథటిక్ ఆర్గానిక్స్ కెమికల్స్, ఫ్లోరిన్ ఆధారిత రసాయనాల తయారీ, కో- జనరేషన్ పవర్ ప్లాంట్ (6ఎమ్డబ్ల్యూ) ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు ఆందోళన చేపడుతున్నారు. 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లుతో నిర్మాణం ఈ పరిశ్రమను చేపడుతున్నారు. పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి అక్టోబర్ 14న జిల్లా కలెక్టర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.
అప్పట్లోనే పరిశ్రమ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకించారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కారణంగా భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని వారంతా ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా మరో రసాయన పరిశ్రమ ఏర్పాటు చేస్తే మా గ్రామాలను కాలి చేసి వలసలు పోవాల్సిందేనని వారంతా వాపోతున్నారు. పరిశ్రమల కారణంగా పచ్చని పొలాలన్నీ బీడుగా మారుతునాయని వారంతా ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా పరిశ్రమ నిర్మాణం నిలుపుదల చేయకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కారణంగా చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కీళ్లవాతం తదితర వ్యాధులతో బాధపడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. ఇప్పుడు కొత్త పరిశ్రమ మా నెత్తిన తెచ్చి పెడితే చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయొద్దంటూ వేడుకున్నారు.
తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... పరిశ్రమ వద్దంటూ గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై గ్రామంలో దర్యాప్తు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: