Congress Inauguration Ceremony : కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ దేశవ్యాప్తంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూడా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం గాంధీభవన్‌లో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నేతలు హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
అసంతృప్తి నేతల హాజరుపై సందేహాం..: ఇటీవల పీసీసీ వ్యతిరేకవర్గ సీనియర్ నేతలు మీడియా ముందుకు వచ్చిన తర్వాత నాయకుల మధ్య అంతరం మరింత పెరిగింది. గతంలో నివురు గప్పిన నిప్పులా విభేదాలు ఉన్నప్పటికీ.. బయటకు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేకుండా పోయాయి. మాట్లాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి పీసీసీ వ్యతిరేకవర్గ సీనియర్లు హాజరు కావడం అనుమానమేనని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
నాయకుల మధ్య పొడచూపిన విబేధాలను తొలగించేందుకు ఇటీవల ఏఐసీసీ దూతగా హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్.. 60 మందికిపైగా నాయకులతో వేర్వేరుగా చర్చించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్న దిగ్విజయ్.. రాష్ట్రంలో పార్టీ నాయకుల మధ్య తెరపైకి వచ్చిన విబేధాలను తొలగించేందుకు వీలుగా నివేదిక ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి వర్గం హాజరవుతారా..!: ఇవాళ పీజేఆర్ వర్ధంతి కూడా ఉండటంతో.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం ఖైరతాబాద్ సర్కిల్‌లోని పీజీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించనున్నారు. పీసీసీ వ్యతిరేకవర్గ సీనియర్లు దోమలగూడలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్దన్ రెడ్డి నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం హాజరు అనుమానమేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.