Prakasham district Students in Ukraine: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన బెల్లంకొండ చిరంజీవి, తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన అల్లంనేని విజయరాఘవ ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లారు. చదువు పూర్తి కావడంతో మరో వారం రోజుల్లో ధ్రువ పత్రాలు తీసుకుని స్వదేశానికి తిరుగు పయనమవుదామని అనుకున్నారు. అంతలోనే రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొనటంతో విమానాశ్రయాలు మూసివేశారు.
గత రెండు రోజులుగా బంకర్లలో తలదాచుకుంటూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో వారి కుటుంబ సభ్యులు.. వారి పిల్లల క్షేమసమాచారాలు తెలుసుకుంటూ భయాందోళనలకు గురవుతున్నారు. టీవీల్లో ప్రసారమౌతున్న యుద్ధాన్ని చూస్తూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న తమ పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్పించే బాధ్యతను భారత ప్రభుత్వం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి : ఉక్రెయిన్లో గుంటూరు జిల్లా విద్యార్థుల అవస్థలు