ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క కాటుకు వ్యాక్సిన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మందుల పంపిణీలో సాంకేతిక లోపాలు కుక్క కాటు బాధితులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఓ పిచ్చికుక్క గంట వ్యవధిలోనే తాళ్లూరులో ఐదుగురు, కొర్రపాటివారిపాలెంలో నలుగురిని కరవగా.. చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. చుట్టుపక్కల గ్రామాలైన దర్శి, చీమకుర్తి, ముండ్లమూరు, మారెళ్ల, పొదిలి ఆరోగ్య కేంద్రాల్లోనూ వ్యాక్సిన్ లేదని.. జిల్లా కేంద్రమైన ఒంగోలు సర్వజన ఆసుపత్రికి బాధితులు పరుగులు పెట్టారు.
పంపిణీలో లోపాలు
జిల్లా మొత్తానికి మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో 4 వేలకు పైగా డోసుల వ్యాక్సిన్ ఉంది. అయితే పంపిణీలో లోపాలు, బడ్జెట్ సరిపోని కారణంగా తరచూ ర్యాబిస్ వ్యాక్సిన్ సమస్య తలెత్తుతోంది. అవసరమైన మందులను ఈ - ఔషధి యాప్‌లో నమోదు చేస్తే సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బంది.. ప్రతి మూడు నెలలకోసారి ఆరోగ్య కేంద్రాలకు మందులు సరఫరా చేస్తారు. మద్యలో ఏవైనా మందులు అయిపోతే ఆ క్వార్టర్‌కు సంబంధించిన బడ్జెట్ పరిమితి ఉంటేనే ఇస్తారు. లేకుంటే మళ్లీ క్వార్టర్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి ర్యాబిస్ వ్యాక్సిన్ కేవలం 10 వైల్స్ మాత్రమే ఇస్తారు. మూడు మాసాల్లోపు 10 మంది కంటే ఎక్కువ మంది భాదితులు వస్తే వీరు జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టాల్సిందే.
అసలే కరోనా సమయంలో సమయానికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి.. చీరాలలో రెండు రోజుల సంపూర్ణ లాక్డౌన్