వైకాపా దుర్మార్గపు పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకే బాపట్ల పార్లమెంటరీ స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శిలో సమావేశం జరగ్గా.. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. రైతుల సమస్యలపై అన్నదాతలకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు. రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం చెబుతుంటే.. ఇంత వరకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు సిద్ధం కావడాన్ని తప్పుపట్టారు.
వైకాపా శ్రేణులకు మద్యం పాలసీ వరంగా మారిందని మాజీ మంత్రి ఆరోపించారు. ఆ పార్టీ నేతలే వీటిని తయారు చేస్తుండగా.. అది తాగిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారని విమర్శించారు. ఒంగోలు డెయిరీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వైకాపా నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేశారని దుయ్యబట్టారు. బాపట్లలో పార్టీ బలంగా ఉందని, నియోజకవర్గాల్లో కొత్తగా కమిటీలు వేసి ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగడతామని.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలిపారు. ఈ సమావేశంలో అనగాని సత్యప్రసాద్, చీరాల, సంతనూతలపాడు తెదేపా ఇంఛార్జిలు ఎడం బాలాజీ, బీఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హిందూ మతానికి ఏదో జరిగిపోయినట్లు అతిగా స్పందిస్తున్నారు : సీపీఐ రామకృష్ణ