Crimes and Accidents: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామం వద్ద ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కోట మోహన్‌రెడ్డి, కోట రాధ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. గ్రామంలో జరిగిన చౌడేశ్వరిదేవి తిరుణాళ్ల సందర్భంగా రాధ తల్లిదండ్రుల వద్దకు .. తన ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చింది. వ్యక్తిగత పనుల మీద కనిగిరి వెళ్లిన ఆమె.. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ ఆధారంగా రాధ ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టిన పోలీసులు.. అక్కడకి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాధ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తే చంపి ఉంటారని రాధ తండ్రి ఆరోపించారు.
రంపం బ్లేడుతో గొంతు కోశాడు: ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పని చేస్తున్న యువకుడిని హతమార్చిన ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాడినాడలో చోటుచేసుకుంది. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన శేఖర్ కొంతకాలంగా ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి శేఖర్ మద్యం విక్రయిస్తున్న సమయంలో.. కట్ట వెంకట రామ్మోహనరావు అనే వ్యక్తి శేఖర్‌పై దాడి చేశాడు. వెనుక నుంచి రంపం బ్లేడుతో శేఖర్ గొంతు కోశాడు. అనంతరం దుకాణం బయటకు తీసుకువచ్చి మరోసారి విచక్షణా రహితంగా గొంతు, చేతులు, కాళ్లపై కోశాడు. దీంతో శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడు రామ్మోహనరావును స్టేషన్రు తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.
పొట్టకూటి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామం వద్ద బైకు, ఆటో ఢీకొనడంతో అప్పయ్య అనే వ్యక్తి మృతి చెందగా.. ఆంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ పాత గుంతకల్లుకు చెందిన వారిగా గుర్తించారు. బేల్దారి పనిచేస్తూ జీవనం కొనసాగించే వీరు బేల్దారి పనులు చేస్తూ గుంతకల్లులోని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పనికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే వీరిద్దరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అప్పయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇతనికి ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. పొట్టకూటి కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో.. కుటుంబ సభ్యుల రోదనలు అందరికీ కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహంతో ఇంటిముందు ఆందోళన: శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం కాల్వపల్లి గ్రామంలో.. అర్ధరాత్రి వేళ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీరప్ప(55) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా.. అతని మృతికి అదే గ్రామానికి చెందిన మనోహర్ అనే వ్యక్తి కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని మనోహర్ ఇంటి ముందు ఉంచడంతో.. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీరప్ప ఇటుకల బట్టి నిర్వహిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అధికంగా విద్యుత్ వినియోగిస్తున్నారని.. లక్ష రూపాయలకు పైబడి బిల్లు చెల్లించాలని బీరప్పకు నోటీసులు జారీ చేశారు. అయితే న్యాయవాది మనోహర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం కారణంగానే.. తనిఖీ చేశారని బీరప్ప బంధువులు ఆరోపిస్తున్నారు. దీని కారణంగానే బీరప్పకు గుండెపోటు వచ్చిందంటూ మృతదేహంతో మనోహర్ ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇవీ చదవండి: