అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రపంచ పెద్దపులి ట్రంప్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ వెంటనే తిరిగి భారత్ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. విదేశీ పాలు, కోడి కాళ్ళు మాకు వద్దంటూ నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ విధానాలను విరమించుకోవాలన్నారు. భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్య, వలసలను నివారించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ కర్నూలులో రైతు సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అమెరికాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోకూడదని వారు డిమాండ్ చేశారు. అమెరికా నుంచి కోళ్ళను దిగుమతి చేసుకుంటే మన దేశ కోళ్ల పరిశ్రమ మూతపడుతుందని... అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.
కడపలో
కడపలో పలు పార్టీల ఆధ్వర్యంలో ట్రంప్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ట్రంప్, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోటి మందితో స్వాగతం పలుకుతూ.. కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజ మెత్తారు. దేశంలో ఆకలి చావులతో రైతన్నల ఆత్మహత్యలు, లక్షల మంది ముస్లింలు ఆందోళనలు జరుగుతున్న సమయంలో భారతదేశానికి ట్రంప్ రావడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
అనంతపురంలో
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ట్రంప్ పర్యటనను నిరసిస్తూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబుల కొండారెడ్డి మాట్లాడుతూ ట్రంప్ పర్యటన వల్ల కోళ్ల పరిశ్రమ, వ్యవసాయ రంగం అట్టడుగు స్థాయికి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: