నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అధికారికంగా 96 కేసులు ఉన్నట్లు చెప్తున్నారని.. అయితే అంతకంటే ఎక్కువగానే ఉన్నాయనే ఆందోళన ప్రజల్లో నెలకొని ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొరుగున ఉన్న తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని.. మన రాష్ట్రంలోనూ మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. చెన్నైతో నెల్లూరు, చిత్తూరు జిల్లావారికి వ్యాపారపరమైన సంబంధాలు, రాకపోకలు ఉంటాయన్నారు. అక్కడి కోయంబేడు మార్కెట్‌కి వ్యవసాయ ఉత్పత్తులు వెళ్తుంటాయి కాబట్టి ఆ జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత అవసరం
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య పెరగడం, ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, ప్రజా సమస్యలపై జిల్లా నాయకులతో చర్చించారు. కరోనా ఎక్కువ కాలం ఉండే ఆరోగ్య సంబంధిత సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారని... అంతర్జాతీయంగా ఈ సమస్య అదుపులోకి వచ్చేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టవచ్చని నిపుణుల వ్యాసాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేయాలన్నారు.
భరోసా కల్పించండి
కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల పలు రంగాలు దెబ్బతిని, నష్టపోయాయని... వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారని... వారిపట్ల ప్రభుత్వం సానుభూతితో స్పందించి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో స్వర్ణకారులు, చేనేత వృత్తిలో ఉన్నవారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని.. వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చేతి వృత్తులు, కులవృత్తుల్లో ఉన్నవారికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని.. ఏయే రంగాలు ఏ విధంగా ప్రభావితమైంది అనే విషయాలపై సమగ్రంగా నివేదిక సిద్ధం చేస్తున్నామని జిల్లా నేతలకు పవన్ కల్యాణ్ వివరించారు..
ఇవీ చదవండి.. ఆందోళనలు వద్దు.. అండగా నిలబడదాం: పవన్