నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలతో కలిసి.. స్టౌబిడి కాలనీ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రికి అడుగడుగునా నిరసనలు (Nellore Flood victims Fire) వ్యక్తమయ్యాయి. వరదలో ఇళ్లు మునిగి, కట్టుబట్టలతో వీధిన పడ్డ తాము..ఆహారం, తాగునీరు లేక అలమటించామని బాధితులు వాపోయారు. అయినా తమను ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని మంత్రి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బాలినేని హామీ ఇచ్చారు. నిరసనల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పర్యటించకుండానే పోలీసుల సాయంతో మంత్రి తిరుగు పయనమయ్యారు.
అన్ని విధాలా ఆదుకుంటాం..
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన భవన్లో జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద నష్టంపై కలెక్టర్ చక్రధర బాబు మంత్రులకు వివరించారు. వరద తాకిడికి గురైన 48 వేల కుటుంబాలను సహాయం అందిస్తామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరింత సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి