TDP Leaders Selfie Challenge: రాష్ట్రంలో సెల్ఫీ ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంత్రి విడదల రజనికి టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 2018లో తాను మంత్రిగా ఉన్న సమయంలో నాబార్డు ద్వారా చిలకలూరిపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.19 కోట్లు తెచ్చి పనులు చేపట్టినా.. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదన్నారు.
ప్రస్తుత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చేతగానితనం, అసమర్థత వలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 100 పడకల ఆసుపత్రికి సంబంధించి 14 మంది వైద్యులు, సిబ్బంది ఇప్పటికే వచ్చి ఉన్నా.. కనీసం వారు కూర్చోవడానికి సౌకర్యాలు లేవన్నారు. కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వైద్య మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని నాలుగేళ్లయినా పూర్తి చేయలేదని అన్నారు.
ఇప్పటికైనా మంత్రి సెల్ఫీ ఛాలెంజ్‌ను స్వీకరించి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్మాణం, పరికరాల కొనుగోలులో వైద్య మంత్రికి కమిషన్లు అందకపోవడం వలనే ఆలస్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఈనెల 25, 26, 27 తేదీలలో సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. చంద్రబాబు సభలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు.
మంత్రి అప్పలరాజుకి గౌతు శిరీష సవాల్: శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి చెప్పాలంటూ.. నిర్మాణంలో ఉన్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం వద్ద మంత్రి సీదిరి అప్పలరాజు గురువారం సెల్ఫీ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన ఛాలెంజ్‌పై టీడీపీ నాయకురాలు గౌతు శిరీష స్పందించారు. టీడీపీ ప్రభుత్వంలో పలాసలో నిర్మించిన హుద్ హుద్, టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగి.. ఇదీ టీడీపీ చేసిన అభివృద్ధి అని చెప్పారు. మంత్రి అప్పలరాజు ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయకుండానే.. రంగులు వేసి సెల్పీ దిగారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల లోపు కిడ్నీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. మంత్రికి గౌతు శిరీష సవాల్ విసిరారు.
గంటా సెల్ఫీ ఛాలెంజ్: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాల వద్ద సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశాఖ నగరంలో 2014-19 మధ్య తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏయూ కన్వెన్షన్ సెంటర్, ఉడా చిల్డ్రన్స్ ఎరీనా, టీయూ 142 ఎయిర్ క్రాప్టు మ్యూజియం, ఇంకా మరెన్నో సజీవ సాక్ష్యాలు ఇదిగో అంటూ సెల్ఫీలను పోస్ట్ చేసిన మాజీ మంత్రి.. సీఎం జగన్‌ని నిలదీశారు. ఈ నాలుగేళ్లలో విశాఖలో కట్టిన ఒక చిన్న రేకుల షెడ్డు చూపించగలరా జగన్మోహన్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: