Vote Deletion in NTR District: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో ఉన్న అధికార వైసీపీ అవకతవకలకు పాల్పడుతోంది. ఓటరు జాబితాలో మార్పుచేర్పులకు పాల్పడుతోంది. విజయవాడ మధ్య నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఓటరు జాబితాను తారుమారు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే డోరు నంబరుతో వందల మందికి ఓట్లు సృష్టించగా.. మరికొన్ని చోట్ల.. ఇంటి నంబరు లేకుండానే ఓట్లను చేరుస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది అపరిచితులేనని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రతికూలంగా ఉన్నవారి ఓట్ల తొలగింపు ఇష్టారాజ్యంగా సాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మధ్య నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబర్ 193 పరిధిలో మొత్తం 860 ఓట్లు ఉన్నాయి. ఇందులో డోరు నంబరు లేకుండా 364 ఓట్లు చేరాయి. మరోవైరు ఒకే డోరు నంబరుతో వందలాది ఓట్లు చేర్పించేశారు. ఇంటి నంబరు లేకుండా కూడా ఓట్లు... జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. 2022 సంవత్సరంలో జనవరిలో ఉన్న ఓటర్ల జాబితాకు, 2023 జనవరిలో ఉన్న ఓటర్ల జాబితాకు అసలు పొంతనే లేదు. ఓటర్ల నమోదు, మార్పుచేర్పుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు తెలిసింది. చాలా మంది ఓట్లు తొలగించడం, ఆ స్థానంలో బోగస్ ఓట్లు చేర్పించడం చాపకింద నీరులా నిశ్శబ్దంలా సాగిపోయింది.
ఓటర్ల జాబితాను ఏటా సవరించడం ఆనవాయితీ. వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా నేపథ్యంలో.. భారీగా ఓట్ల తొలగింపు బోగస్ ఓట్ల చేర్పులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఓ పార్టీకి పని చేసే సర్వే సంస్థ సూచనల మేరకు ఓటర్ల జాబితాలో పేర్లు మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఓటరు కార్డుల్లో సుమారు 80 శాతం వరకు ఆధార్ అనుసంధానం జరిగింది. తప్పనిసరి కాకపోయిన కూడా అధికారులు ప్రతి ఇంటికి తిరిగి.. అనుసంధానం తప్పనిసరని పట్టుబట్టి మరీ చేయించారు. ఈ క్రమంలోనే అనుమానం ఉన్న వాటిని తొలగించినట్లు తెలిసింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నగరపాలక సంస్థలోని మొత్తం 21 డివిజన్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు కేవలం... 25 ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి బొండా ఉమాపై గెలిచారు. దీంతో ఓటర్ల జాబితాను ఇప్పుడు కావల్సిన విధంగా మార్చుతున్నారనే విమర్శలున్నాయి. నియోజకవర్గంలోని 35, 152, 193, 18, 21 నంబరు పోలింగ్ బూత్‌ల పరిధిలో తనిఖీ చేయగా.. పలు ఓట్లు గల్లంతైనట్లు తెలిసింది. 193నంబర్ బూత్‌లోని 364 ఓట్లలో చాలా ఓట్లు గల్లంతయ్యాయి. పలువురికి ఓటరు కార్డులున్నా జాబితాలో పేర్లు కనిపించడం లేదు.
ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో డోర్ నంబర్ లేకుండానే వందలాది ఓట్లు కనిపిస్తున్నాయి. 24వ డివిజన్‌లోని 152వ నంబర్ బూత్‌లో డోరు నంబరు అనే చోట కడియాలవారి వీధి అని ఉంది. దీనిలో ఏకంగా 506 ఓట్లున్నాయి. 23వ డివిజన్ 193వ నంబర్ బూత్‌లో డోరు నంబర్ లేకుండానే 264 ఓట్లు కనిపిస్తున్నాయి. డివిజన్ నంబర్ 58లోని 35వ నంబరు బూత్‌లో 501 ఓట్లు, 59వ డివిజన్ 18వ బూత్‌లో 125 ఓట్లు, 21వ బూత్‌లో 223 ఓట్లు డోర్ నంబర్ లేకుండానే ఉన్నాయి. డోరు నంబరు ఉన్న చోట 'వీవీ' అని ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఓటర్ల పేర్లు తామెప్పుడూ వినలేదని స్థానికులు వివరించారు.
ఎక్కువగా వాణిజ్య ప్రాంతాల్లోనే ఇలా అపరిచితుల పేర్లతో జాబితా తయారైంది. 193వ బూత్ అంతా గవర్నర్‌పేట, సూర్యారావుపేటల్లో ఉంది. ఇదంతా వ్యాపార కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రులు, దుకాణాలు, మాల్స్ ఉన్నాయి. నివాస ప్రాంతాలు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. దీనిని అదనుగా తీసుకునే డోర్ నంబర్ లేకుండా.. దొంగ ఓట్లను నమోదు చేసి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. డివిజన్ 30లో డోర్ నంబర్ 21-10/2-289తో 240 ఓట్లు ఉన్నాయి. ఇదంతా కాలువగట్టు ఆక్రమిత ప్రాంతం. జాబితాలో పేర్లను క్షేత్రస్థాయిలో పోల్చి చూడగా కొంత మంది ఓటర్లు ఉన్నారు. కొంతమంది లేరు. ఇక్కడి ఆక్రమిత గృహాలకు ఒకే డోర్ నంబర్ ఎలా ఇచ్చారని.. నగరపాలక సంస్థ అధికారులను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు.
సాధారణంగా పక్కన ఉంటే.. 'బై' నంబరుతో ఇస్తారు. 236 బూత్‌లో డోర్ నంబర్ 30-9-1లో 137 ఓట్లు, 120వ బూత్‌లో డోర్ నంబరు 21-10/2-287లో 176 ఓట్లు, 39వ బూత్‌లో 43-106/1-58 నంబరులో 379 ఓట్లు ఉన్నాయి. బహుళ అంతస్తుల్లో 50 ఫ్లాట్లు ఉన్నా.. మూడేసి చొప్పున 150కి మించవు. కానీ అపార్టుమెంట్ల పేరుతో ఒకే డోరు నంబరు వేసి.. వందలాది ఓట్లు చేర్పించారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. అవి అపార్టుమెంట్లు కావొచ్చని చెబుతున్నారు. అయినా ఓటేసేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరికదా అని సమధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తప్పులతడకలపై ఓటర్లు ఇప్పుడే మేలుకోవాలని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి. తమ ఓటు జాబితాలో ఉందా లేదా అనేది వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని కోరుతున్నాయి.