Temperatures Raises in AP: వానలు పోయి.. ఎండలు ముదరనున్నాయ్. అవును మీరు విన్నది నిజమే.. రాష్ట్రంలో ఈరోజు సుమారు 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపింది. రాబోయే వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని APSDMA స్పష్టం చేసింది. సుమారు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
మంగళవారం(నేడు) అల్లూరి సీతారామరాజులోని 6 మండలాలు, అనకాపల్లి, కాకినాడలో 3మండలాలు, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం అనకాపల్లి జిల్లా కె కోటపాడులో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. కసింకోటలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. వడగాలుల ప్రభావంతో వృద్ధులు, పిల్లలు ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. లేకుంటే ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే వాటర్, జ్యూస్లు, కొబ్బరి బొండాలు తాగాలంటున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం: ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయుగుండంగా మారనుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం రేపటికి ఇది క్రమంగా బలపడి తుపానుగా మారనున్నట్లు వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారిన అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ దిశ మార్చుకుని బంగ్లాదేశ్ -మయన్మార్ల వైపు పయనిస్తుందని వెల్లడించింది. ఈ నెల 12వ తేదీ ఉదయం వరకూ ఇది క్రమంగా బంగ్లా- మయాన్మార్ల వైపు కదులుతుందని స్పష్టం చేసింది. అయితే దీని ప్రభావం కోస్తాంధ్రపై పడబోదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.
అండమాన్ సహా ఏపీ, తమిళనాడు, ఒడిశా తదితర తీరప్రాంతాలకు చెందిన మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిన్న పాటి బోట్లు, నౌకలు, ట్రాలర్లు అండమాన్ తీరప్రాంతాల్లో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే ఈ నెల 12 తేదీ వరకూ బంగాళాఖాతంలోని ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో నౌకల రాకపోకలను నియంత్రించాల్సిందిగా ఐఎండీ సూచనలు జారీ చేసింది.
ఇవీ చదవండి: