Telugu Language Day Wishes: భాషలన్నింటిలోనూ మధురమైన భాష తెలుగు భాష. మాతృభాష తెలుగుని 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా పిలుస్తారు. తెలుగు భాష.. వినడానికి వినసొంపుగా, లోతైన భావాలు కలిగి మృదుమధురంగా ఉంటుంది. అందుకే సాహిత్య పెద్దలు 'తేనెలూరే భాష తెలుగు భాష' అని కొనియాడారు.
'తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స'....
ఇంతటి గొప్ప తెలుగు భాషను అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల్లో, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో ఉండేలా తన జీవిత కాలం పోరాటం చేశారు తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి. గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషను సాధారణ భాషలో బోధించేలా 'వ్యావహారిక భాషోద్యమాన్ని' చేపట్టారు. ఈ క్రమంలో ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, భాషాభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Naidu Wishes to Telugu People: తెలుగు భాషను అందరం కలిసి కాపాడుకుందాం.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు. తెలుగు వ్యావహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయివుండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి.. పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశం పార్టీనే. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నాను'' అని ఆయన అన్నారు.
Telugu Language Day Sand Sculpture : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. సందేశాత్మకంగా సైకత శిల్పం..
Nara Lokesh Wishes to Telugu People: గిడుగు తెలుగుకు-జాతికి వెలుగు తెలుగు.. తెలుగు వెలుగు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని 'తెలుగు భాష దినోత్సవం'గా జరపడం తెలుగువారమంతా గర్వించదగ్గ పర్వదినమని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వ్యావహారిక తెలుగు భాషని సామాన్య జనం చెంతకి చేర్చిన మహానుభావుడు గిడుగు వెంకట రామ్మూర్తి అని కొనియాడారు. ఆయన అమ్మలాంటి తెలుగు భాషకు, జాతికి వెలుగని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Purandeshwari Wishes to Telugu People: తెలుగు భాషను గౌరవించుకుందాం.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భారతీయ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి యావత్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ''పండితులకు మాత్రమే అర్ధమయ్యే గ్రాంథికంగా ఉన్న తెలుగు భాషను సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా ఉద్యమం చేసి, ప్రజలకు ఎంతో సేవ చేసిన గిడుగు వారి కృషి అద్వితీయం, చిరస్మరణీయం. మన మూలాలతో మన బంధాన్ని పటిష్ట పరిచే మన మాతృ భాష తెలుగును మనమందరం గౌరవించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స' అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.
ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
Janasena Chief Pawan Kalyan Comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్ పాలకుడికి తెలుగు అంటే ఆసక్తి లేదు.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న ఈ పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందన్నారు. మాట్లాడే భాష.. రాసే భాష ఒకటి కావాలని తపించి.. ఆ దిశగా వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి అని పవన్ కల్యాణ్ కొనియాడారు. తెలుగు జాతి ఎన్నడూ గిడుగు సేవలను మరువకూడదని పిలుపునిచ్చారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి.. మాతృభాషకు జీవం పోశారని గుర్తు చేశారు.
''తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు. కాబట్టి, ప్రజలే తెలుగు భాషను కాపాడుకొనే బాధ్యతను స్వీకరించాలి. తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పని తీరును గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యా శాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తోంది. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేం. వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలి. చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే దశ నుంచే మన మాతృ భాషను దూరం చేసేలా పాలకుల తీరు ఉంది.''- పవన్ కల్యాణ్, జనసేన పార్టీ