YCP attack on Rameza: విజయవాడ రాణిగారితోటకు చెందిన రమీజా పేద ముస్లిం మహిళ. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవటంతో పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మద్దతురాలిగా ఉన్న రమీజా...అవినాష్ వైకాపాలో చేరిన తరువాత సైతం ఆయన వెంటే ఉన్నారు. ఫించన్ ఇప్పించమని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోవటంతో కలత చెందారు. గడప గడపకూ కార్యక్రమానికి అవినాష్, స్థానిక నేతలు రావడంతో తన పింఛన్ సమస్యపై నిలదీసింది. అంతే తెల్లారేసరికి కార్పొరేటర్ రామిరెడ్డి, 20మంది వైకాపా మహిళా కార్యకర్తలు ఉదయాన్నే వచ్చి రమీజాపై దాడికి దిగారు. సామాన్లు ధ్వంసం చేశారు.
నా గడపకొచ్చారు కాబట్టి నాకున్న సమస్యలు చెప్పమన్నారు.. నేను చెప్పాను.ఏవండీ 4సంవత్సరాలైంది మా ఆయన చనిపోయి నాకు పింఛన్ రాలేదండి అన్నాను. ఇవాళ ఎనిమిందింటికి నా గుమ్మంలో దామోదరం నేను తలుపు తీయగానే ఆ అమ్మాయే అని పక్కకెళ్లి పోయాడు. పక్కకెళ్లి కారం ప్యాకెట్లు తెచ్చి ఆడవాళ్లందరికీ ఇచ్చాడు. మాట్లాడుతూనే కళ్లలో కారం కొట్టమన్నాడు, జుట్టు పట్టుకొని కొట్టమన్నాడు, పూలకుండీలు విసిరేశారు. నెత్తురు కనబడకుండా కొట్టమన్నాడు దామోదరం. అంటే ఏదైనా అడిగితే ఇలాగే కొట్టి చంపేస్తారా..? -ఎస్కే రమీజా, బాధితురాలు
రమీజాపై దాడికి పాల్పడిన వారిని వదిలేసి, బాధితుల్ని కృష్ణలంక పీఎస్‌కు తరలించటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి బంధువులు స్థానికులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. అయితే రమీజాని ఉదయం తొమ్మిది గంటలకు పోలీసులు తీసుకెళ్లి... రాత్రి ఏడు గంటలకు వదిలారు. స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డి గెలుపు కోసం తాము కృషి చేస్తే ఈ విధంగా దాడి చేయడమేంటని మండిపడ్డారు. తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని వాలంటీర్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని బాధితురాలి మేనకోడలు ఆరోపించారు. కాగా రమీజా కు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతీ నెలా రూ.3వేలు ఫించన్ ఇస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించారు.
వైకాపా దాడి గురించి తెలుసుకుని బాధితురాలి పరామర్శించేందుకు బయలుదేరిన స్థానిక తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఖాకీల తీరుకు నిరసనగా రహదారి మీదే ఆయన నిరసన తెలపటంతో బందర్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. దాంతో గద్దె రామ్మోహన్‌ను పోలీసులే స్టేషన్‌కు తీసుకెళ్లారు. సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని రామ్మోహన్ మండిపడ్డారు. తెదేపా చవకబారు రాజకీయాలు చేస్తోందని దేవినేని అవినాష్ ఆరోపించారు.
మహిళపై వైకాపా దాడి ఘటనలో నిందితుల్ని శిక్షించాలంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విజయవాడ సీపీని కలిపి ఫిర్యాదు చేశారు. జనసేన నేతలు బాధితుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఇవీ చదవండి: