TSRTC SALARY HIKE: ఆర్టీసీ ఉద్యోగులకు వేతనసవరణ అమలు చేయాలన్న ప్రతిపాదన ఈసీ నుంచి వెనక్కు వచ్చింది. నిర్ధేశిత కమిటీ ద్వారా కాకుండా నేరుగా కార్పొరేషన్, సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన రావడంతో దాన్ని సీఈఓ కార్యాలయం వెనక్కు పంపినట్లు తెలిసింది. 2017లో కార్మికసంఘాలు, ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన ఒప్పందానికి అనుగుణంగా పీఆర్సీ అమలు కోసం రహదార్లు, భవనాల శాఖకు ఆర్టీసీ ఎండీ లేఖ రాశారు. అయితే మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ లేఖను పంపారు.
అయితే నిబంధనల ప్రకారం అటువంటి అనుమతి కోరేందుకు ప్రతిపాదనలు నేరుగా ఈసీకి పంపరాదని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఆ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాతే ఈసీకి పంపాల్సి ఉంటుంది. అయితే పీఆర్సీ ప్రతిపాదన కమిటీ నుంచి కాకుండా నేరుగా కార్పొరేషన్, సంబంధిత శాఖ నుంచి రావడంతో తిప్పిపంపినట్లు సమాచారం. ఆ తరవాత ప్రతిపాదనను సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనసవరణ ప్రతిపాదనను మరోమారు ఈసీకి పంపనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: