తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు కాకపోవడంతో మరోసారి ఉద్యమం ఉద్ధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదే అంశంపై ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం బుధవారం విజయవాడలో సమావేశం కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కఠ నెలకొంది.
పీఆర్సీ సహా వివిధ ఆర్ధిక, ఆర్ధికేతర డిమాండ్లపై ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలను చేపడుతున్నారు.
మార్చి 9 తేదీ నుంచి నల్లబ్యాడ్జీలు, వర్క్ టూ రూల్ లాంటి నిరసన కార్యక్రమాలను ఏపీ జేఏసీ అమరావతి చేపట్టింది. బుధవారం ఉదయం మరోమారు వివిధ ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఒకటో తేదీనే జీతాల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతో పాటు 11 పీఆర్సీ ప్రతిపాదించిన స్కేళ్లను విడుదల చేయాలని నేతలు కోరుతున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న 4 డీఏ అరియర్లను తక్షణం చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేస్తోంది. ఉద్యోగులకు నగదు రహిత హెల్తు కార్డుల జారీ కోసం పట్టుబడుతున్నారు. దీంతో పాటు అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లోనూ 16 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నేత బొప్పరాజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఉద్యోగ సమస్యలపై ఆయా కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఖశ్చితమైన స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో జరగబోయే సమావేశం ప్రధాన్యత సంతరిచుకుంది.
ఇవీ చదవండి: