Anganwadis React on ESMA Act: రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అంగన్‌వాడీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా చట్టం ఉత్తర్వులను విజయవాడ ధర్నా చౌక్‌లో తగలబెట్టి, నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ, గత 26 రోజులుగా ఆందోళన చేస్తోన్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
Anganwadi Workers Fire on CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విజయవాడలో కార్మిక సంఘాల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నేతలు మాట్లాడుతూ అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ''కార్మికులతో ప్రభుత్వం ఘర్షణకు దిగడం సరైన పద్దతి కాదు. ప్రభుత్వ వైఖరి వల్ల 25 రోజులుగా సమ్మె చేస్తున్నాం. నాలుగేళ్లుగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ఇచ్చిన హామీ అమలు చేయాలనే అంగన్‌వాడీలు కోరుతున్నారు. నాలుగు రోజులు చర్చించినా రూపాయి జీతం పెంచరా ? కార్మికులు తిరగబడితే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది. అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం'' అని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రేపటి నుంచి 24 గంటల రిలే నిరాహార దీక్షలు: అంగన్‌వాడీలు
ESMA Act Orders Burning: అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వివిధ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పరిశ్రమల వద్ద జీవో కాపీలు దహనం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ నెల 9న జైల్ భరో నిర్వహిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర బంద్ చేస్తామని హెచ్చరించారు. లక్షా 4 వేల మంది మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
మా గోడు వైసీపీ ప్రభుత్వానికి పట్టదా - అంగన్వాడీల ఆవేదన
''మా సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మె చేస్తుంటే చేతకాని జగన్ సర్కార్ ఎస్మా పేరుతో మమ్మల్ని భయపెట్టాలని చూడటం దుర్మార్గం. మా సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మెను కొనసాగిస్తాం. అంగన్‌వాడీల కోరికలపై ఇదే వైఖరితో సీఎం జగన్ ఉంటే, మరో మూడు నెలల్లో ఇంటికి పంపిస్తాం. అంగన్‌వాడీలతో పెట్టుకుంటే జగన్ సర్కార్ కూలడం ఖాయం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము సమ్మె కొనసాగిస్తాం. ఇప్పటికైనా జగన్ సర్కార్ కనీస వేతనాలు ఇవ్వాలి. గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలి. మినీ అంగన్‌వాడీల కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలి." -కార్మిక సంఘాల నేతలు, అంగన్‌వాడీలు.
అంగన్వాడీతో ప్రభుత్వం మళ్లీ చర్చలు - ఆ రెండు డిమాండ్లపై కార్యకర్తల పట్టు