Minister Peddireddy Comments on Industrial Waste: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా ఇప్పటివరకూ 8.32 లక్షల మెట్రిక్ టన్నుల ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్ధాలను నిర్వహించినట్టు అటవీ పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీఈఎంసీ ద్వారా ఫ్లైయాష్ నిర్వహణ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇప్పటివరకూ 6 లక్షల కిలో లీటర్ల ద్రవ వ్యర్ధాలను సురక్షితంగా నిర్వహించి, ధ్వంసం చేసినట్టు వివరించారు. 2020లో ఏర్పాటైన ఈ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రమాదకరమైన ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుని సురక్షితంగా వాటిని తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 983 వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు ఉన్నాయని, వాటి నుంచి వస్తున్న ఘన, ద్రవ వ్యర్ధాలను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాష్‌ను కూడా నిర్వహించేందుకు ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ పది థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోందని, ఈ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. సిమెంటు ఫ్యాక్టరీలు, ఇటుక తయారీ కేంద్రాల వద్దకు ఈ ఫ్లైయాష్‌ను చేర్చేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి